రోహిత్‌ ‘400’ కొట్టగలడు

2 Dec, 2019 04:01 IST|Sakshi

డేవిడ్‌ వార్నర్‌ వ్యాఖ్య

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ 335 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ సమయంలో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన బ్రియాన్‌ లారా 400 పరుగుల రికార్డును వార్నర్‌ బద్దలు కొట్టగలడని అనిపించింది. అయితే అనూహ్యంగా ఆసీస్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడం కొంత వివాదం రేపగా, భారీగా చర్చ సాగింది. అయితే వార్నర్‌ దీనిపై స్వయంగా స్పందించాడు. ‘నా ఆట గురించి నేనే చెప్పగలను. మైదానంలో బౌండరీలు చాలా పెద్దవి. వేగంగా పరుగులు చేయడం అంత సులువు కాదు. తీవ్రంగా అలసిపోయిన తర్వాత మరింతగా శ్రమించడం, ఏదోలా పరుగుల కోసం ప్రయత్నించడం కష్టంగా మారిపోతుంది. చివర్లో నేను బౌండరీలు కొట్టలేక సింగిల్స్‌ తీస్తూ పోయాను.

అయితే 400 పరుగుల ఘనతను సాధించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారా అని నన్నడిగితే రోహిత్‌ శర్మ పేరు చెబుతాను’ అని వార్నర్‌ వ్యాఖ్యానించాడు. కెరీర్‌ ఆరంభంలోనే తాను టెస్టు ఆటగాడిగా ఎదగగలనని నమ్మకం పెంచిన వ్యక్తి సెహ్వాగ్ అని వార్నర్‌ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సెహ్వాగ్‌తో కలిసి అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడాడు. టి20లు, వన్డేల్లో ఆసీస్‌కు ఆడిన మూడేళ్ల తర్వాత గానీ అతనికి తొలి టెస్టు అవకాశం రాలేదు. ‘నేను మంచి టెస్టు ఆటగాడిగా ఎదగగలనని సెహా్వగ్‌ చెబితే పిచ్చోడిని చూసినట్లు చూశాను. కానీ అతను టెస్టుల్లో ఉండే ఫీల్డింగ్‌ వ్యూహాలు నాలాంటి ఆటగాడికి సరిగ్గా సరిపోతాయని విశ్లేషించడం నాకింకా గుర్తుంది’ అని వ్యాఖ్యానించాడు.  

►వార్నర్‌ నా రికార్డును అందుకునే వరకు ఆట కొనసాగిస్తారని భావించాను. నేను తన రికార్డును అధిగమించినప్పుడు సోబర్స్‌ కూడా ఆ ఘనతను ఆస్వాదించారు. రికార్డులనేవి ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాక తప్పదు. దూకుడైన, వినోదం పంచే ఆటగాళ్లు అది సాధించినప్పుడు మరింత  అద్భుతంగా అనిపిస్తుంది.
–వార్నర్‌ స్కోరుపై బ్రియాన్‌ లారా వ్యాఖ్య

మరిన్ని వార్తలు