అది భయానకంగా ఉంది: అశ్విన్‌

2 Nov, 2019 15:25 IST|Sakshi
ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో ఇక్కడ అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌ను  వాయు కాలుష్యం భయపెడుతోంది. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలనుకున్నపటికీ అది సాధ్యం కాకపోవడంతో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు ఇక్కడ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి.  తొలి టీ20కి వాయు కాలుష్య ప్రభావం ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడగా, బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదన్నాడు.

కాగా, భారత స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ‘ ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో నాణ్యత లేదు.  అదొక భయానకంగా ఉంది. ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం తీసుకునే ఊపిరిలో ఆక్సిజన్‌ శాతం అవసరమైనంత ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో మాట్లాడిన రోహిత్‌ శర్మ మాత్రం వాయు కాలుష్యంతో ఇబ్బందేమీ ఉండదన్నాడు. తామంతా మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదన్నాడు. ఇది కేవలం మూడు గంటల ఆటే కావడంతో మ్యాచ్‌ సజావుగా సాగుతుందని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు