'ఏ విచారణకైనా మేము సిద్ధం'

29 Dec, 2015 20:41 IST|Sakshi

న్యూఢిల్లీ:డీడీసీఏలో ఎటువంటి అవతవకలు జరగలేదని ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏ చాలా స్వచ్ఛంగా ఉందని, అసలు తమ క్రికెట్ అసోసియేషన్ లో ఎటువంటి సమస్యలేవని పేర్కొన్నాడు. ఈ మేరకు మంగళవారం చేతన్ చౌహాన్ నేతృత్వంలోని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్  ఓ ప్రకటన విడుదల చేసింది.  తాము ఏ తరహా విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.  తమను సీబీఐ ఏ సమాచారం కోరినా అందజేస్తామని చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏపై విచారణకు ఆదేశించిన వారే ఇప్పుడు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.


డీడీసీఏలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో డీడీసీఏ కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కేజ్రీవాల్ తో పాటు మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, కీర్తి ఆజాద్ లు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు