ధోని సరైన నిర్ణయం తీసుకున్నాడు

5 Jan, 2017 23:59 IST|Sakshi
ధోని సరైన నిర్ణయం తీసుకున్నాడు

స్వాగతించిన ఎమ్మెస్కే ప్రసాద్‌

ముంబై: భారత వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్‌ ధోని నిర్ణయాన్ని జాతీయ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్వాగతించారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో ఈ నెల 15 నుంచి జరగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ధోని పేరును పరిశీలిస్తామని ఆయన సూత్రప్రాయంగా చెప్పారు. ‘ధోని ఈ నిర్ణయం ఏడాది, ఆరు నెలల కిందట తీసుకుని ఉంటే నేను కాస్త ఆందోళన చెందేవాడిని. కానీ ఇప్పుడు సరైన సమయంలో అతను తప్పుకున్నాడు. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా తన సేవలను మరికొన్ని సంవత్సరాలు అందిస్తాడనే నమ్మకం నాకుంది. 

జట్టు నిర్మాణంలో అతని పాత్ర వెలకట్టలేనిది’ అని ప్రసాద్‌ ప్రశంసించారు. కెప్టెన్‌గా వన్డే వరల్డ్‌ కప్, టి20 ప్రపంచ కప్, చాంపియన్స్‌ ట్రోఫీలను సాధించిన ఘనత భవిష్యత్తులో మరెవ్వరికీ సాధ్యం కాదని, ఇకపై నాయకుడిగా అతను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు. ధోని జట్టులో ఉండటం కోహ్లికి ఎంతో మేలు చేస్తుందని, తన ఆలోచనలను కోహ్లితో పంచుకుంటే జట్టుకు ప్రయోజనం చేకూరుతుందన్న ఎమ్మెస్కే... మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ భారం దిగిపోవడం వల్ల అతను స్వేచ్ఛగా ఆడగలుగుతాడని అన్నారు.

మరిన్ని వార్తలు