‘నన్ను చంపినవారిని పట్టించండి’

30 Jun, 2018 11:10 IST|Sakshi
డీగో మారడోనా (ఫైల్‌ ఫోటో)

మాస్కో: ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డీగో మారడోనాకు చిర్రెత్తుకొచ్చింది. అర్జెంటీనా- నైజీరీయా మ్యాచ్‌ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన ఈ దిగ్గజం.. స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పోందిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే మారడోనా గుండె పోటుతో మరణించాడంటూ కొందరు పుకార్లు సృష్టించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లతో హల్‌ చల్‌ చేశారు. అవికాస్త  వైరల్‌ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

స్పందించిన దిగ్గజం.. ‘మరణ వార్త’పై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు. చనిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కొందరు కల్పించారు అని మండిపడ్డారు.  ఇక అంతటితో ఆగకుండా తనను చంపిన వారిని(చనిపోయినట్టు మెసేజ్‌ చేసినవారిని) పట్టించినవారికి పది వేల అమెరికన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ కథనాలు ప్రచురించిన వెబ్‌సైట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మారడోనా వ్యక్తిగత న్యాయవాది తెలిపారు.

ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంజీనా- నైజీరియా మ్యాచ్‌ సందర్భంగా మారడోనా ప్రవర్తించిన తీరు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.  ఈ దిగ్గజ ఫుట్‌బాలర్‌ ప్రేక్షకులను గేలి చేస్తూ చేతితో అసభ్యకర సంజ్ఞలు చేయండపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మారడోనాపై కోపంగానే కోందరు ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు