కోహ్లికి ధైర్యం చెప్పిన హార్దిక్!

9 Nov, 2017 15:46 IST|Sakshi

తిరువనంతపురం: న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన చివరి టీ 20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరవరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తద్వారా కివీస్ పై తొలిసారి టీ 20 సిరీస్ ను సాధించింది. అయితే ఆఖరి ఓవర్ లో కివీస్ విజయానికి 19 పరుగులు కావాల్సిన తరుణంలో హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ అప్పచెప్పాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. 

తొలి రెండు  బంతులకు పరుగు మాత్రమే ఇచ్చిన హార్దిక్.. ఆపై మూడో బంతికి ఆరు పరుగుల్ని సమర్పించుకున్నాడు. కివీస్ ఆటగాడు గ్రాండ్ హోమ్ సిక్స్ కొట్టి భారత గుండెల్లో పరుగులు పెట్టించాడు. ఆ సమయంలో కోహ్లి కూడా ఒకింత ఆందోళనకు గురయ్యాడు. మ్యాచ్ చేజారిపోతుందా అనే భావనకు వచ్చేశాడు. ఆ క్రమంలోనే హార్దిక్ దగ్గరకు వచ్చిన కోహ్లికి ఊహించని సమాధానం ఎదురైందట. 'కోహ్లి భాయ్ టెన్షన్ వద్దు.. నేను బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపిస్తా. నువ్వు చింతించకు'అని హార్దిక్ ధైర్యం చెప్పినట్లు కోహ్లి పేర్కొన్నాడు. 'ఒక కెప్టెన్ గా నాకు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. మన బౌలర్లలో ఈ తరహా నమ్మకం ఉండటం నాకు చాలా ఆనందాన్ని కల్గించింది. హార్దిక్ సామర్థ్యంపై అతను నమ్మకంగానే ఉన్నాడనే విషయం నాకు అప్పుడు అర్ధమైంది. దాన్ని నిజం చేస్తూ చక్కటి ఫినిషింగ్ ను ఇచ్చాడు. భారత జట్టులో బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయడమే హోరా హోరీ పోరుల్లో విజయానికి ప్రధాన కారణం'అని కోహ్లి పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు