మూడో స్థానంలో భారత్

29 Apr, 2016 01:33 IST|Sakshi
మూడో స్థానంలో భారత్

డోపింగ్ నిబంధనల ఉల్లంఘన దేశాల జాబితా వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడాపోటీల్లో నిలకడగా రాణించలేకపోతున్నా.... డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలో మాత్రం మనోళ్లు ఘనులే అని నిరూపించుకున్నారు. 2014లో డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించిన (ఏడీఆర్‌వీ) జాబితాలో 96 కేసులతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. వివిధ జాతీయ సంస్థలు పంపిన నివేదికల ఆధారంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఈ జాబితాను రూపొందించింది. రష్యా (148), ఇటలీ (123) తొలి రెండు స్థానాల్లో ఉండగా, టాప్-10 వరుసగా బెల్జియం (91), ఫ్రాన్స్ (91), టర్కీ (73), ఆస్ట్రేలియా (49), చైనా (49), బ్రెజిల్ (46), దక్షిణ కొరి యా (43)లు ఉన్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డోపింగ్‌లో పట్టుబడ్డ అథ్లెట్లను హెచ్చరించినా లేదా అనర్హత వేటు వేసినా... ఏడీఆర్‌వీ కేసుగా నమోదు చేస్తారు.

భారత్‌లో 96 కేసులు నమోదు కాగా ఇందులో నాలుగు నాన్ ఎనలైటికల్ కేసులు ఉన్నాయి. ఓవరాల్‌గా పోటీల సందర్భంగా 79 (56 పురుషుల, 23 మహిళలు), పోటీలు లేనప్పుడు 13 (9 పురుషులు, 4 మహిళలు) నమోదయ్యాయి. డోప్ ఉల్లంఘనులు అత్యధికంగా అథ్లెటిక్స్ (29), పవర్‌లిఫ్టింగ్ (23), వెయిట్ లిఫ్టింగ్ (22)లో ఉండగా... బాస్కెట్‌బాల్ (3), జూడో (3), తైక్వాండో (3), రెజ్లింగ్ (3), ఉషు (3), బాక్సింగ్ (2)లో తక్కువ సంఖ్యలో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు