ఆ అనుభూతి బాగుంది: అమిత్ మిశ్రా

22 Oct, 2016 19:47 IST|Sakshi
ఆ అనుభూతి బాగుంది: అమిత్ మిశ్రా

మొహాలి:న్యూజిలాండ్ తో వన్డే సిరీస్లో భాగంగా భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ గైర్హాజరీతో జట్టులో చోటు దక్కించుకున్న అమిత్ మిశ్రా తన సీనియారిటీపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులోని  యువకులు తన నుంచి అనేక సలహాలు తీసుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందన్నాడు.

'నా అనుభవం కారణంగా యువ క్రికెటర్లకు అనేక సలహాలు ఇస్తున్నా. జట్టులోని యువ క్రికెటర్లు నా నుంచి కొన్ని సూచనలు తీసుకుంటున్నారు. అలా అడిగిన వారికి కొన్ని టిప్స్ ఇస్తున్నా. ఒక గేమ్ ఆడేటప్పుడే కాకుండా , మిగతా సమయాల్లో కూడా యువ క్రికెటర్లకు నాకు చేతనైన సాయం చేస్తున్నా. ఈ పాత్రతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అలా సలహాలివ్వడం నాకు కర్తవ్యంలో భాగంగానే భావిస్తున్నా.ప్రత్యేకంగా అక్షర్ పటేల్, కేదర్ జాదవ్లతో నా అనుభవాన్ని పంచుకుంటున్నా. ఆ అనుభూతి బాగుంది ' అని అమిత్ మిశ్రా అన్నాడు.

భారత కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందని మిశ్రా పేర్కొన్నాడు. జట్టులోని సభ్యుల్ని మానసికంగా బలంగా ఉంచడంలో కుంబ్లే తన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడని కొనియాడాడు. తాను తుది జట్టులో లేకపోయినా, కుంబ్లే మ్యాచ్ గురించి అనేక విషయాలు చర్చిస్తాడన్నాడు. ఇది ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ వన్డే సిరీస్లో ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో మిశ్రా ఆకట్టుకున్నాడు. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు సాధించిన మిశ్రా.. ఢిల్లీ మ్యాచ్లో కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు