అశ్విన్‌ ‘యో యో’ పాస్‌

12 Oct, 2017 05:18 IST|Sakshi

ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న ఆఫ్‌ స్పిన్నర్‌

చెన్నై: భారత క్రికెట్‌ జట్టులోని ప్రధాన క్రికెటర్లలో చురుకుదనం కాస్త ‘తక్కువగా’ కనిపించే ఆటగాడిగా రవిచంద్రన్‌ అశ్విన్‌కు పేరుంది. కొంత మంది ఆటగాళ్లను మైదానంలో ఎక్కడ దాచాలో కూడా తెలీదు అంటూ  కెప్టెన్‌గా ఉన్న సమయంలో స్వయంగా ధోని కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అనేక సార్లు ప్రస్తావించాడు. టెస్టుల్లో టాప్‌ స్పిన్నర్‌గా గుర్తింపు ఉన్నా... పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో కొన్నాళ్లుగా అశ్విన్‌ను పక్కన పెడుతున్న కారణాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు అశ్విన్‌ ఫిట్‌నెస్‌లోనూ తన సత్తా చాటి దేనికైనా సిద్ధమే అంటూ సందేశం పంపించాడు. ఇటీవల భారత ఆటగాళ్లకు తప్పనిసరిగా మారిన కఠినమైన ‘యో యో’ టెస్టులో అశ్విన్‌ పాసయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో తాను ఈ టెస్టుకు హాజరై సఫలమైనట్లు అశ్విన్‌ ట్విట్టర్‌లో వెల్లడించాడు.

20 మార్కుల ఈ టెస్టులో బీసీసీఐ ప్రమాణాల ప్రకారం కనీసం 16.1 మార్కులు స్కోరు చేయాల్సి ఉంటుంది. సీనియర్లు యువరాజ్, రైనాలాంటి వాళ్లు కూడా యో యో టెస్టులో విఫలమైన చోట అశ్విన్‌ ఆ లైన్‌ను దాటగలగటం విశేషం. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో తొలి మ్యాచ్‌లో ఆడిన అశ్విన్‌... శనివారం నుంచి త్రిపురతో జరిగే మ్యాచ్‌ కోసం కూడా అందుబాటులో ఉన్నాడు. మరోవైపు మంగళవారం ప్రకటించిన తాజా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. అశ్విన్‌ను అధిగమించి కగిసో రబడ మూడో స్థానానికి చేరాడు. అండర్సన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.   

మరిన్ని వార్తలు