కోహ్లిపై ఆసీస్‌ బౌలర్‌ పరుష వ్యాఖ్యలు!

19 Dec, 2018 13:33 IST|Sakshi

పెర్త్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో టెస్ట్‌లో వ్యవహరించిన తీరుపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ మండిపడ్డాడు. కోహ్లి ఓ అమర్యాదస్తుడని, వెర్రివాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ టెస్ట్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్‌ పైన్‌, కోహ్లిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరడం.. భారత్‌ 146 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే. అయితే మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల కెప్టెన్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకునే సందర్భంలో కోహ్లి అమర్యాదకంగా ప్రవర్తించాడని ఫాక్స్‌ స్పోర్ట్స్‌కు రాసిన కథనంలో జాన్స్‌న్‌ అభిప్రాయపడ్డాడు.

‘కోహ్లి టీమ్‌ పైన్‌ పట్ల అలా వ్యవహరించాల్సింది కాదు. అతనితో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.. కానీ అతనివైపు చూడలేదు. ఇది అగౌరవపడచడమే. కోహ్లి చాలా మంది క్రికెటర్లకు దూరంగా వెళ్తుంటాడు. తాను విరాట్‌ కోహ్లిననే అహాన్ని ప్రదర్శిస్తాడు. అతనో వెర్రివాడు. నాకు తెలిసి అతనేం మారలేదు.’ అని పేర్కొన్నాడు. ఇక టీమ్‌ పైన్‌ వ్యవహారంలో కోహ్లి తప్పేం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ అతనికి మద్దతుగా నిలిచింది.  2014 మెల్‌బోర్న్‌ టెస్ట్‌ సందర్భంగా కోహ్లి-జాన్సన్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు