అది భారత క్రికెట్‌ జట్టుకు లోటే: గంభీర్‌

17 May, 2019 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌ సమరానికి వెళ్లే భారత క్రికెట్‌ జట్టు ఎంపికపై ఇప్పటికే పలు విమర్శలు చవిచూసిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి బయల్దేరి భారత జట్టు కూర్పుపై పలువురు మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే నాల్గో పేసర్‌ అంశం ప్రధానంగా వినిపిస్తోంది. బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, షమీలతో పాటు మరో ఎటాకింగ్‌ పేసర్‌ను తీసుకుని ఉంటే బాగుండేదనేది విశ్లేషకులు వాదన. దీనిపై భారత క్రికెట్‌ కెప్టెన్‌ కోహ్లి స్పందిస్తూ.. నాల్గో పేసర్‌ లేకుండా వరల్డ్‌కప్‌కు వెళ్లడం నిరాశపరుస్తున‍్నా, జట్టును సమతుల్యంగా ఉంచే క్రమంలో ఒక పేసర్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్నాడు.

ప్రస్తుతం ఇదే అంశంపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ పెదవి విప్పాడు. ‘ పేస్‌ విభాగంలో ఒక సీమర్‌ తక్కువయ్యాడు. ఇది కచ్చితంగా భారత జట్టుకు లోటే. ఒక నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్‌ లేకుండానే వరల్డ్‌కప్‌కు వెళుతున్నారు. ఇంకో పేస్‌  బౌలర్‌ అదనంగా ఉంటే బుమ్రా,షమీ, భువీలకు సపోర్ట్‌గా ఉండేది. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లైన హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌లు ఉన్నారు అనే వాదన సెలక్షన్‌ కమిటీ చేయవచ్చు. దీనితో నేను ఏకీభవించను. స్పెషలిస్టు పేసర్‌కు ఆల్‌ రౌండర్లకు చాలా తేడా ఉంటుంది. ఇంగ్లండ్‌లో వికెట్‌ చాలా ఫ్లాట్‌గా ఉండటంతో పాటు అక్కడ వాతావరణం కూడా హాట్‌గానే ఉంటుంది. వరల్డ్‌కప్‌లో భారత్‌ పరిస్థితి ఏమిటి అనేది బుమ్రా చేతుల్లోనే ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు