ప్రజ్ఞాన్‌ ఓజాకు గంగూలీ ఝలక్‌

31 Aug, 2017 01:10 IST|Sakshi
ప్రజ్ఞాన్‌ ఓజాకు గంగూలీ ఝలక్‌

కోల్‌కతా: తిరిగి హైదరాబాద్‌కు ఆడాలన్న ప్రజ్ఞాన్‌ ఓజా ఆశలపై  బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నీళ్లు చల్లారు. బెంగాల్‌  నుంచి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ను విడుదల చేయబోమని స్పష్టం చేశారు. రెండేళ్లుగా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ స్పిన్నర్‌ ఈ సీజన్‌ కోసం తిరిగి సొంత జట్టు హైదరాబాద్‌కు వెళ్లాలని ఆశించాడు. ఈ మేరకు నిరభ్యంతర పత్రం కోసం దరఖాస్తు కూడా చేశాడు. తాజాగా దీన్ని భారత మాజీ కెప్టెన్‌ తిరస్కరించారు. ‘అతను విడుదల చేయాలని కోరాడు. కానీ మేం చేయం. హైదరాబాద్‌ ప్లేట్‌ డివిజన్‌లో ఉన్నప్పుడు మా జట్టుతో చేరాడు. ఇప్పుడు హైదరాబాద్‌ ఎలైట్‌కు చేరిందని వెళితే ఎలా? అతని సేవలు మాకు అవసరం’ అని అన్నారు.

సీజన్‌కు ముందు జరిగే శిబిరంలో ఓజా పాల్గొంటాడని దాదా చెప్పారు. దీనిపై హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్‌ స్పంది స్తూ ‘బెంగాల్‌ నిరభ్యంతర పత్రం ఇవ్వనపుడు మేం చేయగలిగిందేమీ లేదు. గంగూలీ అంటే మాకెంతో గౌరవం. మాజీ సారథి ఆట కోసం, ఆటగాళ్ల కోసం బాగా ఆలోచిస్తారు’ అని అన్నారు. 2015–16 సీజన్‌లో బెంగాల్‌కు ఆడిన ఓజా 36 వికెట్లు, గత సీజన్‌లో10 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు