క్రీడల ఫీజులు పెంచిన జీహెచ్‌ఎంసీ

28 Sep, 2019 10:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) క్రీడలపై దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు... ఇండోర్, ఔట్‌డోర్‌ స్టేడియాల ఫీజులను పెంచింది. స్టాండింగ్‌ కమిటీ సైతం దీనికి ఆమోదం తెలపడంతో  ఇకనుంచి పెంచిన ఫీజుల్ని వసూలు చేయనున్నారు. ప్రతి ఏటా జీహెచ్‌ఎంసీ నిర్వహించే వేసవి క్రీడా శిబిరాల ద్వారా వేలాది మంది క్రీడాకారులు లబ్ధి పొందుతున్నారు. సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపుల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టీటీ, రోలర్‌ స్కేటింగ్‌లకు ఇప్పటివరకు ఫీజు రూ. 50 ఉండగా... కొత్తగా పెంచిన ధరతో రూ. 100 చొప్పున వసూలు చేయనున్నారు. స్కూల్స్‌కు అద్దెకిచ్చేందుకు 500 చ.మీ.ల ప్లేగ్రౌండ్‌ 11 నెలల్లో 75 గంటలకు ప్రస్తుతం పదివేల రూపాయలుగా ఉండగా... దీన్ని రూ.15 వేలకు పెంచారు. వినియోగించుకునే గంటల్ని బట్టి ప్రస్తుతం రూ. 20,000 ఫీజును రూ. 30,000గా ... రూ. 40,000 ఫీజును రూ. 60,000గా పెంచారు. అలాగే తాత్కాలిక మైదానాల కోసం కార్పొరేట్‌ సంస్థలు సోమవారం నుంచి గురువారం వరకు పూటకు రూ. 4,000 చెల్లిస్తుండగా...  దాన్ని రూ. 5,000గా పెంచారు. మైదానం ఒకరోజు పూర్తిగా వాడుకుంటే రూ. 7,500 నుంచి రూ.9,000 వసూలు చేయనున్నారు.

పే అండ్‌ ప్లే పేరిట శని, ఆదివారాల్లో పూటకు రూ. 4,000 ఉన్న ఫీజును రూ. 6,000గా, రోజుకు రూ.7, 500 ఉన్న ఫీజును రూ.11,000గా పెంచారు. ఇండోర్, ఔట్‌డోర్‌ స్టేడియాల్లో ఆయా క్రీడలకు నెలవారీ సభ్యత్వ ఫీజుల్ని సైతం పెంచారు. దీంతో ఆటగాళ్లపై అధిక భారం పడనుంది. కొత్తగా పెంచిన ఫీజుల ప్రకారం నెలకు రూ. 1,000 చెల్లించేవారు ఇకనుంచి రూ. 1,500... రూ. 500 చెల్లించేవారు రూ. 750... రూ. 100 చెల్లించేవారు రూ. 200, రూ. 750 చెల్లించేవారు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కరాటే,  యోగా, చెస్, క్యారమ్స్, జూడో, టెన్నికాయిట్‌ బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్‌ క్రీడలు ప్రియమయ్యాయి. 2012 నుంచి ఇప్పటి వరకు «ఫీజులు పెంచకపోవడంతోపాటు చాలా ప్లేగ్రౌండ్లను మల్టీ పర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లుగా తీర్చిదిద్దడం, స్విమ్మింగ్‌పూల్స్‌ ఏర్పాటుతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. జీహెచ్‌ఎంసీ ఆటస్థలాల్లో శిక్షణ పొంది ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. పెరిగిన ధరలు, నూతనంగా ఏర్పాటు చేసిన సదుపాయాల కారణంగా ఫీజులు పెంచినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొన్నప్పటికీ... విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించేందుకు ఉపకరిస్తున్న వీటి ఫీజులు పెంచకుండా సేవాభావంతో నిర్వహించాలనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు