హనుమ విహారి బ్యాటింగ్‌ రికార్డు

15 Feb, 2019 15:37 IST|Sakshi

నాగ్‌పూర్‌: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్‌ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్‌ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి.. రంజీ చాంపియన్‌ విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు.  తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌ళో కూడా శతకం నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో భాగంగా విహారి సెంచరీతో మెరిశాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు సాధించాడు.

ఫలితంగా ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, 2011 తర్వాత ఒక ఇరానీకప్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ కూడా విహారినే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్‌లో రెస్టాఫ్‌ ఇండియాతో తరఫున ఆడిన శిఖర్‌ ధావన్‌.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దాంతో విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రెస్టాఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 330 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 374/3 డిక్లేర్డ్‌

విదర్భ తొలి ఇన్నింగ్స్‌ 425 ఆలౌట్‌

మరిన్ని వార్తలు