భారత ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా విహారి 

24 Dec, 2019 01:05 IST|Sakshi

న్యూజిలాండ్‌ పర్యటనకు జట్ల ఎంపిక

న్యూఢిల్లీ: వచ్చే నెలలో న్యూజిలాండ్‌ పర్యటించే భారత ‘ఎ’ జట్లను సెలక్టర్లు ప్రకటించారు. ఈ టూర్‌లో భాగంగా ‘ఎ’ టీమ్‌ 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన పలువురు ఆటగాళ్లను రెండు అనధికారిక టెస్టుల కోసం ఎంపిక చేశారు. ఈ రెండు టెస్టులకు ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి నాయకత్వం వహిస్తాడు. చతేశ్వర్‌ పుజారా, రహానే, మయాంక్‌ అగర్వాల్, సాహా, అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో ఆడతారు. డోపింగ్‌ నిషేధం ముగిసిన మళ్లీ దేశవాళీ బరిలోకి దిగిన పృథ్వీ షాకు కూడా ఇందులో చోటు దక్కింది. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ కూడా రెండు టెస్టులకు ఎంపికయ్యాడు.

హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ రెండు టీమ్‌లలోనూ ఉన్నాడు. వన్డే జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టీమ్‌లో కూడా సిరాజ్‌కు అవకాశం దక్కింది. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్‌ పాండ్యాను ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేయడం విశేషం. ‘ఎ’ సిరీస్‌ తర్వాత భారత సీనియర్‌ జట్టు కివీస్‌తో తలపడనున్న నేపథ్యంలో సన్నాహకంగా అనేక మంది రెగ్యులర్‌ ఆటగాళ్లను ముందే న్యూజిలాండ్‌కు బీసీసీఐ పంపిస్తోంది. 24 జనవరి నుంచి భారత సీనియర్‌ టీమ్‌ పర్యటన మొదలవుతుంది.

>
మరిన్ని వార్తలు