హార్దిక్‌ చితక్కొట్టుడు మామూలుగా లేదు!

6 Mar, 2020 15:02 IST|Sakshi

టీ20ల్లో రికార్డు బ్యాటింగ్‌

55 బంతుల్లో 158 నాటౌట్‌

ముంబై: టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పూనకం వచ్చినట్లే ఆడుతున్నాడు. తనను సీనియర్‌ జట్టులోకి ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదనే సంకేతాలు పంపుతూనే ఉన్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో ఇప్పటికే రెండు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న హార్దిక్‌.. ఈసారి మాత్రం​ సిక్సర్లే చిన్నబోయేలా బాదేశాడు. ఏకంగా 20 సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డివై పాటిల్‌ కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడుతున్న హార్దిక్‌.. తాజాగా బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. మిడాన్‌ మీదుగా సిక్స్‌ కొట్టి శతకం పూర్తి చేసుకున్న హార్దిక్‌.. ఆ తర్వాత కూడా మరింత రెచ్చిపోయాడు. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇది ఈ టోర్నీలో హార్దిక్‌కు రెండో సెంచరీ. (హార్దిక్‌ బాదుడే బాదుడు)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బీపీసీఎల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన రిలయన్స్‌-1 బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్‌లో హార్దిక్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో రిలయన్స్‌-1 స్కోరు బోర్డుపై 238 పరుగుల్ని ఉంచింది. ఈ క్రమంలోనే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌ రికార్డును హార్దిక్‌ నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌ రికార్డు శ్రేయస్‌ అయ్యర్‌ పేరిట ఉండేది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో అయ్యర్‌ 147 పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకూ అత్యుత్తమం, కాగా దానిని హార్దిక్‌ బ్రేక్‌ చేశాడు. (హార్దిక్‌ రీ ఎంట్రీ అదిరింది..)


 

>
మరిన్ని వార్తలు