ఆటగాళ్ల ఫైర్‌ : పునరాలోచనలో హర్యానా ప్రభుత్వం

8 Jun, 2018 18:30 IST|Sakshi
మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌

చండీగఢ్ : క్రీడాకారుల సంపాదనలో మూడోవంతును ప్రభుత్వానికి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటీఫికేషన్‌ జారీచేయవద్దని సంబంధిత క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సీఎం మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌ మీడియాకు తెలిపారు.  తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నామని, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్న అథ్లెట్లు వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్ 30 న హర్యానా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్‌ పతాక విజేత సుశీల్‌ కుమార్‌,  ఫోగట్‌ సిస్టర్స్‌ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఈ నోటీఫికేషన్‌ విడుదల చేసేముందు ప్రభుత్వం తమతో చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర బీజేపీ నేత జవహార్‌ యాదవ్‌ వెనకేసుకొచ్చారు. అథ్లెట్లు క్రీడల్లో గెలిచిన ప్రైజ్‌ మనీని ఇవ్వమనడం లేదని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారో వారినే ఇవ్వమంటున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు