ఏసీబీ కోర్టుకు హెచ్‌సీఏ సభ్యులు

29 Nov, 2016 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రస్తుత, మాజీ కార్యవర్గ సభ్యులు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్, కోశాధికారి ఆర్.దేవరాజ్ ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చారు. వీరితో పాటు మాజీ అధ్యక్షుడు జి.వినోద్, మాజీ కార్యదర్శులు ఎంవీ శ్రీధర్, డీఎస్ చలపతి, ఎస్.వెంకటేశ్వరన్‌లతో పాటు స్టార్ మర్కంటైల్ ప్రతినిధి కూడా హాజరయ్యారు.  అభియోగపత్రాన్ని (చార్జిషీట్) కోర్టు ఈ సందర్భంగా నిందితులకు అందజేసింది. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కనోపీ, ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుతోపాటు ఇతర నిర్మాణాలకు సంబంధించి అప్పటి కార్యవర్గం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ షాలిమార్ క్రికెట్ ఎలెవెన్ క్లబ్‌కు చెందిన ఎజాజ్ అలీ ఖురేషీ దాఖలు చేసిన ప్రత్యేక ఫిర్యాదును విచారించిన ప్రత్యేక కోర్టు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గతంలో ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తు చేసిన ఏసీబీ...ఆగస్టులో పలు అభియోగాలు మోపుతూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు...నిందితుల వ్యక్తిగత హాజరుకు ఆదేశించడంతో నిందితులు హాజరై చార్జిషీట్ ప్రతులను తీసుకున్నారు.

మరిన్ని వార్తలు