తర్వాతి రోజుల్లోనే హెడ్‌మాస్టర్‌ అయ్యాను!

8 Nov, 2017 01:11 IST|Sakshi

మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో క్రమశిక్షణకు మారుపేరైన ఆటగాడిగా అనిల్‌ కుంబ్లే పేరు వినిపిస్తుంది. కెరీర్‌లోనూ, ఆ తర్వాత కోచ్‌గా పని చేసినప్పుడు కూడా ఇదే లక్షణం కుంబ్లేను ప్రత్యేకంగా నిలబెట్టింది. చివరకు అదే కారణం చేత ‘హెడ్‌మాస్టర్‌’ తరహా శిక్షణ ఇస్తున్నాడనిపించుకొని జట్టు కోచ్‌ పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ‘హెడ్‌మాస్టర్‌’ ముద్ర తనకు మొదటి నుంచీ లేదని, ఆటగాడిగా తర్వాతి రోజుల్లో తనను అలా పిలవడం మొదలు పెట్టారని అతను అన్నాడు. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్‌ రిఫ్రెష్‌’కు సంబంధించి మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడుతూ కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆత్మవిశ్వాసం అనేది నాకు వారసత్వంగానే వచ్చింది. మనల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలాంటి వారు మనకు నేర్పే విలువల నుంచి ఇది వస్తుంది. మా తాత స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా పని చేసేవారు.

హెడ్‌మాస్టర్‌ అనే పదం నా కెరీర్‌ తర్వాతి రోజుల్లో నాతో జత చేరుతుందని నాకు బాగా తెలుసు. అది నిజంగానే జరిగింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకందరికీ బాగా తెలుసు’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. 2003 – 04 సమయంలో తన కెరీర్‌ డోలాయమాన స్థితిలో ఉందని, జట్టులో చోటు కోసం హర్భజన్‌తో పోటీ పడుతున్న ఆ సమయంలో తాను రిటైర్‌ కావాలని కూడా వార్తలు వచ్చాయని కుంబ్లే గుర్తు చేసుకున్నా డు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్‌ టెస్టులో తాను బాగా ఆడటంతో పాటు భారత్‌ గెలవడంతో తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడిందని కుంబ్లే చెప్పాడు. భారత క్రికెట్‌లో 1983 వన్డే వరల్డ్‌ కప్‌ విజయం, 2001లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ లు అత్యుత్తమ ఘట్టాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.   

మరిన్ని వార్తలు