నేడే ఫైనల్‌ ‘షో’ | Sakshi
Sakshi News home page

నేడే ఫైనల్‌ ‘షో’

Published Wed, Nov 8 2017 1:09 AM

National Senior Badminton Championship final today - Sakshi

అనుకున్నదే నిజమైంది.  ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు అద్భుత ముగింపు లభించబోతుంది. 2007 తర్వాత సైనా నెహ్వాల్‌... 2013 తర్వాత పీవీ సింధు ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగడమే కాకుండా టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయస్థాయిలో ఈ ఇద్దరూ ముఖాముఖిగా రెండుసార్లు తలపడగా... ఒక్కోసారి గెలిచి సమఉజ్జీగా ఉన్నారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఈ ఇద్దరూ అమీతుమీ తేల్చుకోనుండటంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.  సైనా 2006, 2007లలో... సింధు 2011, 2013లలో విజేతగా నిలిచారు.  

నాగ్‌పూర్‌: ఒలింపిక్‌ పతక విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి టైటిల్‌ కోసం ముఖాముఖిగా తలపడేందుకు రంగం సిద్ధమైంది. 2007 తర్వాత తర్వాత సైనా... 2013 తర్వాత సింధు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీలో బరిలోకి దిగారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో సైనా (పీఎస్‌పీబీ) 21–11, 21–10తో అనురా (ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై గెలుపొందగా... సింధు (ఆంధ్రప్రదేశ్‌) 17–21, 21–15, 21–11తో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)పై కష్టపడి విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (పీఎస్‌పీబీ), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (పీఎస్‌పీబీ) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్‌ 21–16, 21–18తో లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌)పై, ప్రణయ్‌ 21–14, 21–17తో క్వాలిఫయర్‌ శుభాంకర్‌ డే (రైల్వేస్‌)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్‌  జాతీయ చాంపియన్‌గా నిలువగా... ప్రణయ్‌ తొలిసారి ఈ టైటిల్‌ను సాధించేందుకు విజయం దూరంలో ఉన్నాడు.  

‘డబుల్‌’పై సిక్కి రెడ్డి దృష్టి: పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఎన్‌.సిక్కి రెడ్డి రెండు విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (పీఎస్‌పీబీ) జంట 21–10, 21–14తో అపర్ణ బాలన్‌ (పీఎస్‌పీబీ)–శ్రుతి (కేరళ) జోడిని ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం 21–16, 22–24, 21–8తో ఆల్విన్‌ ఫ్రాన్సిస్‌ (కేరళ)–అపర్ణ బాలన్‌ (పీఎస్‌పీబీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) జోడీతో మనూ అత్రి (పీఎస్‌పీబీ)–సుమీత్‌ రెడ్డి (తెలంగాణ) జంట తలపడుతుంది.   

Advertisement
Advertisement