కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు

20 Sep, 2023 16:56 IST|Sakshi

నట దిగ్గజం​ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్‌ 19) ప్రసారమైన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ ఎదుర్కొన్నాడు. 

ప్రశ్న ఏమిటంటే..?
భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్‌, ఎస్‌ వెంకట్రాఘవన్‌, డేవిడ్‌ షెపర్డ్‌, ఏవీ జయప్రకాశ్‌ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్‌ చేయండి. 

కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్‌లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్‌ ఎండ్‌లో ఏవీ జయప్రకాశ్‌ అంపైర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. టెస్ట్‌ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్‌ లేకర్‌ (ఇంగ్లండ్‌), ఇటీవలికాలంలో న్యూజిలాండ్‌ స్పిన్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ ఈ ఘనత సాధించారు. 

ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కెరీర్‌ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్‌ తరఫున 132 టెస్ట్‌లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్‌ ఆండర్సన్‌ (690), షేన్‌ వార్న్‌ (708), ముత్తయ్య మురళీథరన్‌ (800) మాత్రమే ఉన్నారు. 

మరిన్ని వార్తలు