గెలవాల్సిన చోట ఓటమి

5 Mar, 2017 10:32 IST|Sakshi
గెలవాల్సిన చోట ఓటమి

హైదరాబాద్‌కు తొలి పరాజయం  

వికెట్‌ తేడాతో కర్ణాటక విజయం
విజయ్‌ హజారే క్రికెట్‌ టోర్నీ  

కోల్‌కతా: వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్‌ ఖాతాలో ఐదో విజయం కూడా చేరేది. కానీ ఆఖరి వికెట్‌ పడగొట్టడంలో బౌలర్లు విఫలమవ్వడంతో... విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా కోల్‌కతాలో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కర్ణాటక ఒక వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 44 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. బద్రీనాథ్‌ (18) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (8), అక్షత్‌ రెడ్డి (9) విఫలమయ్యారు. గత మ్యాచ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సుమంత్‌ (6), బావనక సందీప్‌ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

తర్వాత కెప్టెన్‌ బద్రీనాథ్, ఆకాశ్‌ భండారి (17) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో గౌతమ్‌ ఈ జోడిని విడగొట్టాడు. గౌతమ్‌ బౌలింగ్‌లో ఉతప్పకు క్యాచ్‌ ఇచ్చి బద్రీనాథ్‌ వెనుదిరగగా...  మరికొంత సేపటికే ఆకాశ్‌ స్టంపౌటయ్యాడు. దీంతో 74 పరుగులకే 6 కీలక వికెట్లను కోల్పోయి హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. తర్వాత జోషి బౌలింగ్‌లో అనిరుధ్‌ (9) ఔటవ్వగా... హసన్‌ (9), సిరాజ్‌ (5), ఎం. రవికిరణ్‌ (4)లను గౌతమ్‌ అవుట్‌ చేశాడు. అనంతరం కర్ణాటక జట్టు 29.2 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసి గెలిచింది. స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కర్ణాటక జట్టుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (4) వికెట్‌ తీసి మిలింద్‌ హైదరాబాద్‌ శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (26) పర్వాలేదనిపించాడు. రవికుమార్‌ సమర్థ్‌ (1), కృష్ణప్ప గౌతమ్‌ (16), మనీశ్‌ పాండే (0), అనిరుద్ధ జోషి (0), పవన్‌ దేశ్‌ పాండే (0) వెంటవెంటనే ఔటవ్వడంతో ఓ దశలో 81/9 తో కర్ణాటక ఓటమి అంచున నిలిచింది. అయితే చివర్లో వినయ్‌ కుమార్‌ (56 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు) హైదరాబాద్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్‌ తేడాతో ఆ జట్టు గెలుపొందింది. హైదరాబాద్‌ బౌలర్లలో మిలింద్, సిరాజ్‌ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. రవికిరణ్‌ 2 వికెట్లు తీశాడు. ఈ ఓటమితో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో సర్వీసెస్‌ జట్టుతో హైదరాబాద్‌ తలపడనుంది.


స్కోరు వివరాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (రనౌట్‌) 8, అక్షత్‌ రెడ్డి (సి) పాండే (బి) బిన్నీ 9, సుమంత్‌ (సి) సుమర్థ్‌ (బి) అరవింద్‌ 6, బద్రీనాథ్‌ (సి) ఉతప్ప (బి) గౌతమ్‌ 18, బావనక సందీప్‌ (రనౌట్‌) 5, ఆకాశ్‌ భండారి (స్టంప్డ్‌) ఉతప్ప (బి) గౌతమ్‌ 17, అనిరుధ్‌ (స్టంప్డ్‌) ఉతప్ప (బి) జోషి 8, మెహదీ హసన్‌ (సి అండ్‌ బి) గౌతమ్‌ 9, సీవీ మిలింద్‌ నాటౌట్‌ 9, సిరాజ్‌ (స్టంప్డ్‌ ) ఉతప్ప (బి) గౌతమ్‌ 5, ఎం.రవికిరణ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) గౌతమ్‌ 4, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం (44 ఓవర్లలో ఆలౌట్‌) 108.  

వికెట్ల పతనం: 1–21, 2–23, 3–30, 4–48, 5–69, 6–74, 7–84, 8–90, 9–98, 10–108.
బౌలింగ్‌: వినయ్‌ కుమార్‌ 10–2–23–0, ప్రసిధ్‌ కృష్ణ 8–0–22–0, స్టువర్ట్‌ బిన్నీ 9–3–20–1, అరవింద్‌ 8–1–10–1, కృష్ణప్ప గౌతమ్‌ 8–0–28–5, అనిరుద్ధ జోషి 1–0–1–1.

కర్ణాటక ఇన్నింగ్స్‌: రాబిన్‌ ఉతప్ప (సి) రవికిరణ్‌ (బి) మిలింద్‌ 4, మయాంక్‌ అగర్వాల్‌ (బి)హసన్‌ 26, సమర్థ్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 1, కె. గౌతమ్‌ (బి) మిలింద్‌ 16, మనీశ్‌ పాండే (బి) మిలింద్‌ 0, జోషి (సి) సుమంత్‌ (బి) సిరాజ్‌ 0, పవన్‌ దేశ్‌పాండే (బి) సిరాజ్‌ 0, స్టువర్ట్‌ బిన్నీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 14, వినయ్‌ కుమార్‌ (నాటౌట్‌) 35, అరవింద్‌ (సి) తన్మయ్‌ అగర్వాల్‌ (బి) రవికిరణ్‌ 3, ప్రసిధ్‌ కృష్ణ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (29.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 109.

వికెట్ల పతనం: 1–5, 2–9, 3–39, 4–39, 5–46, 6–46, 7–65, 8–65, 9–81. బౌలింగ్‌: ఎం. రవికిరణ్‌ 8–2–32–2, సీవీ మిలింద్‌ 9.2–0–42–3, సిరాజ్‌ 9–0–24–3, మెహదీ హసన్‌ 3–1–8–1.  
 

మరిన్ని వార్తలు