పప్పులో కాలేసిన పాక్‌ ఫ్యాన్స్‌!

19 Nov, 2018 14:35 IST|Sakshi

దుబాయ్‌ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చేసిన ఓ ట్వీట్‌ విషయంలో పాకిస్తాన్‌ అభిమానులు పప్పులో కాలేశారు. ఆ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకొని ఐసీసీపై మండిపడ్డారు. చివరకు ఆ ట్వీట్‌పై ఐసీసీ క్లారిటీ ఇవ్వడంతో తమ తప్పును గుర్తించారు. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐసీసీ.. సెమీస్‌కు చేరే జట్లకు సంబంధించి ట్విటర్‌ వేదికగా ఓ క్వశ్చన్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లను ప్రస్తావిస్తూ.. ఏయే జట్లు తలపడాలనుకుంటున్నారని అభిమానులను ప్రశ్నించింది.

అయితే ఈ పోల్‌లో ఐసీసీ WT20 హ్యాష్‌ ట్యాగ్‌ జత చేయడంతో పాక్‌ అభిమానులు పురుషుల వరల్డ్‌ టీ20 అని పొరపాటు పడ్డారు. ఈ పోల్‌లో టీ20ల్లో నెం1 జట్టు అయిన పాక్‌ లేకపోవడం ఏంటని మండిపడ్డారు. ‘ఐసీసీ ఓ గుడ్డిది.. చెవిటిది.. దానికి కనీసం నెం1 జట్టు ఏంటిదో కూడా తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లతో ఖంగుతిన్న ఐసీసీ.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ మహిళలు గ్రూప్‌ స్టేజ్‌ దాటలేదని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయ్యాయి.  
 

మరిన్ని వార్తలు