అయ్యర్‌ మళ్లీ కొట్టేస్తే.. పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు

15 Dec, 2019 16:19 IST|Sakshi

చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకున్నాడు.  జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు నిలకడగా ఆడి హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 70 బంతుల్లో 4 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌(6) తర్వాత విరాట్‌ కోహ్లి(4) కూడా పెవిలియన్‌ చేరగా రోహిత్‌ శర్మతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ కలిసి 55 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(36) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో బంతిని పుల్‌ చేయబోయి రోహిత్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ తరుణంలో రిషభ్‌ పంత్‌తో కలిసి అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అయ్యర్‌ ముందుగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయ్యర్‌కు ఐదో వన్డే హాఫ్‌ సెంచరీ.ఆపై కాసేపటికి పంత్‌ కూడా అర్థ శతకం సాధించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో పంత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పంత్‌కు వన్డేలో తొలి సెంచరీ కావడం విశేషం. చాలాకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న పంత్‌.. హాఫ్‌ సెంచరీ సాధించి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. తన సహజ సిద్ధమైన ఆటతోనే పంత్‌ మెరుపులు మెరిపించగా, అయ్యర్‌ మాత్రం అత్యంత నిలకడగా ఆడాడు. పంత్‌ వందకు పైగా స్టైక్‌రేట్‌తో హాఫ్‌ సెంచరీని సాధించడం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌  ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు  దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి వికెట్‌గా కేఎల్‌ రాహుల్‌(6) ఔట్‌ కాగా, రెండో వికెట్‌గా విరాట్‌ కోహ్లి(4) పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు.  ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ను ఔట్‌ చేసిన కాట్రెల్‌.. ఆ ఓవర్‌ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. హెట్‌మెయిర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ ఔట్‌ కాగా, కోహ్లి వికెట్ల మీదుగా బంతిని ఆడి బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరుణంలో రోహిత్‌-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను సాఫీగా ముందుకు తీసుకెళ్లింది. అటు తర్వాత అయ్యర్‌-పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. 34 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.


 

మరిన్ని వార్తలు