వన్డే సిరీస్‌ ఎవరిదో?

16 Jul, 2018 16:45 IST|Sakshi

లీడ్స్‌: టీమిండియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే మూడో వన్డే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి సమంగా నిలవడంతో చివరిదైన మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుంది. తొలి వన్డేలో గెలిచి మంచి ఊపు మీద కనిపించిన టీమిండియా.. రెండో వన్డేలో చతికిలబడింది. ఇంగ్లండ్‌ చేతిలో 86 పరుగుల తేడాతో పరాజయం చెందడంతో సిరీస్‌ సమం అయ్యింది. దాంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో మంగళవారం జరిగే చివరి వన్డేలో గెలుపొందడంపై ఇరు జట్లు దృష్టి సారించాయి. రేపు సాయంత్రం గం.5.00.లకు మూడో వన్డే ఆరంభం కానుంది.

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించింది. కాగా, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహులు లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత మిడిల్‌ ఆర్డర్‌పై పడింది. ఆ క‍్రమంలోనే విరాట్‌ కోహ్లి-సురేశ్‌ రైనాల జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే వీరు 80 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత కోహ్లి ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి రైనా కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తరుణంలో ధోని, హార్దిక్‌ పాండ్యాలు జట్టు పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేసినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు.

రెండో వన్డేలో భారీ భాగస్వామ్యాలు లేకపోవడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. దాంతో మూడో వన్డేలో గెలవాలంటే ఓపెనర్లు శుభారంభం చేయడంతో పాటు మిడిల్‌ ఆర్డర్‌ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత తొందరగా రెండో వన్డే నుంచి గుణపాఠం నేర్చుకుని టీమిండియా సమష్టి ప్రదర్శన చేయక తప్పదు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గెలిచి ఇంగ్లండ్‌కు షాక్‌ ఇవ్వాలని యోచిస్తోంది. అదే సమయంలో ఆఖరి వన్డేలో విజయం సాధించి టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.


 

మరిన్ని వార్తలు