దశ మార్చిన పేస్‌ దళమిదే!

11 Oct, 2019 06:09 IST|Sakshi

దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ వ్యాఖ్య  

ముంబై: ప్రస్తుత పేసర్లు భారత క్రికెట్‌ ముఖ చిత్రాన్నే మార్చారని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. కనీవినీ ఎరుగని సామర్థ్యం ఈ పేస్‌ దళానికి ఉందని కితాబిచ్చారు. ‘ఇలాంటి పేస్‌ అటాక్‌ను గతంలో ఎప్పుడు చూడలేదు. ఇలా ఉంటుందని ఊహించలేదు కూడా! ఇదే అత్యుత్తమమని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత నాలుగైదేళ్లుగా మన ఫాస్ట్‌బౌలర్లు భారత క్రికెట్‌ దశనే మార్చేశారు’ అని కపిల్‌ అన్నారు. గత కొంతకాలంగా భారత జట్టు బుమ్రా, ఉమేశ్, షమీ, ఇషాంత్, దీపక్‌ చహర్, సైనీలతో పటిష్టంగా తయారైన సంగతి తెలిసిందే. బుమ్రా ఇప్పుడు గాయంతో జట్టుకు దూరమైనా ఆ లోటే లేకుండా షమీ ఆ బాధ్యతని సమర్థంగా మోస్తున్నాడు.

దీనిపై కపిల్‌ మాట్లాడుతూ ‘ఐసీసీ టాప్‌–10 బౌలర్ల జాబితాలో ఉన్నారా లేదా అనే విషయం అనవసరం... ఎంత బాగా జట్టుకు ఉపయోగపడుతున్నారన్నదే అవసరం. షమీ అసాధారణంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇంత పెద్ద సంఖ్యలో మన పేసర్లు ప్రపంచ శ్రేణి బౌలర్లుగా ఎదుగుతున్న తీరు గర్వకారణంగా ఉంది’ అని అన్నారు. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చీఫ్‌ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఆయన మాట్లాడుతూ ఇందులో ఎలాంటి పరస్పర ప్రయోజనముందో తెలియట్లేదని... ఇదేమీ శాశ్వత పదవో, జీతం తెచ్చే ఉద్యోగమో కాదన్నారు. ఒకట్రెండు సమా వేశాలకు హాజరయ్యే గౌరవప్రదమైన పదవిలో ప్రయోజనాలు ఏముంటాయని ప్రశి్నంచారు.  

మరిన్ని వార్తలు