కివీస్‌కు భారీ లక్ష్యం

26 Jan, 2019 11:09 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక‍్కడ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)ల  హాఫ్‌ సెంచరీలకు తోడు విరాట్‌ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించడంతో భారత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ల జోడి 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చారు.  తొలుత రోహిత్‌ శర్మ 62 బంతుల్లో అర్థసెంచరీ సాధించగా.. శిఖర్‌ ధావన్‌ 53 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు).. వికెట్‌ కీపర్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.ఆపై కొద్దిసేపటికి రోహిత్‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 172 పరుగుల వద్ద భారత్‌ రెండో్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి-అంబటి రాయుడు ద్వయం స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రాయుడుతో కలిసి 64 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌ యత్నించి కోహ్లి ఔటయ్యాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో ఇష్‌ సోథీ క్యాచ్‌ ఇచ్చి కోహ్లి పెవిలియన్‌ చేరాడు. కాగా, అంబటి రాయుడు(47;49 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక‍్సర్‌) హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి రాయుడు ఔటయ్యాడు. ఇక చివర్లో ఎంఎస్‌ ధోని-కేదర్‌ జాదవ్‌లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు.  జాదవ్‌(22 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ జోడి అజేయంగా 53 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గ్కుసన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు