ఓటమితో ముగింపు

10 May, 2020 05:43 IST|Sakshi

చెన్నై: నేషన్స్‌ కప్‌ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడింది. తొలుత చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1.5–2.5తో ఓటమి చవిచూసిన టీమిండియా... అనంతరం రష్యాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 1.5–2.5తో ఓడిపోయింది.

చైనాతో జరిగిన మ్యాచ్‌లో హరికృష్ణ, విదిత్, హారిక తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆధిబన్‌ ఓడిపోయాడు. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో హంపి గెలుపొందగా... హరికృష్ణ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ఆధిబన్‌ తమ గేముల్లో ఓడిపోయారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్‌ల తర్వాత భారత్‌ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, అమెరికా జట్లు నేడు జరిగే సూపర్‌ ఫైనల్లో టైటిల్‌ కోసం తలపడతాయి.

మరిన్ని వార్తలు