టీమిండియా ‘డబుల్‌ సెంచరీ’!

14 Oct, 2019 13:11 IST|Sakshi

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన వరుస రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పరంగా కూడా దూసుకుపోతుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశ పెట్టిన తర్వాత నాలుగు మ్యాచ్‌లు ఆడింది. దాంతో 200 పాయింట్లతో టాప్‌లో కొనసాగడమే కాకుండా మిగతా జట్లకు అందనంత దూరంలో నిలిచింది. ప్రస్తుతం వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా ‘ డబుల్‌ సెంచరీ’తో ముందంజలో ఉండగా, ఆ తర్వాత న్యూజిలాండ్‌-శ్రీలంకలు సంయుక్తంగా 60 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న జట్ల కంటే కూడా భారత్‌ 140 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఆసీస్‌- ఇంగ్లండ్‌ జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడి 56 పాయింట్లతో ఉన్నాయి.

విండీస్‌ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ ఆడగా, సఫారీలతో మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. విండీస్‌పై 2-0తో సిరీస్‌ను గెలవగా, సఫారీలపై 2-0 సిరీస్‌ గెలిచింది. ఇంకా దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ మిగిలింది.  దాంతో భారత్‌ ఖాతాలో 200 పాయింట్లు చేరాయి. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతి సిరీస్‌కు 120 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు. సిరీస్‌లోని టెస్టుల సంఖ్యకు తగ్గట్లు ఈ పాయింట్లను విభజిస్తారు. గరిష్టంగా ఐదు టెస్టుల సిరీస్‌ మాత్రమే ఇందుకు ప్రామాణికం.

రెండు టెస్టుల సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజేతకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 పాయింట్ల చొప్పున, నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ అయితే మ్యాచ్‌ విజేతకు 30 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ జరిగితే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 24 పాయింట్లగా నిర్ణయించారు. ప్రస్తుతం సఫారీలతో భారత్‌ ఆడేది మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌. దాంతో మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 పాయింట్లు లభిస్తాయి. ఆ క్రమంలోనే భారత్‌ రెండు టెస్టులు గెలిచి 80 పాయింట్లు సాధించింది. అంతకుముందు విండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతో భారత్‌కు 120 పాయింట్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు