మ్యాచ్‌పైనే మా దృష్టి!

10 Apr, 2017 12:32 IST|Sakshi
మ్యాచ్‌పైనే మా దృష్టి!

భారత్‌లో ఏం జరుగుతోందో
 మాకు అనవసరం
 స్పష్టం చేసిన భారత క్రికెటర్లు
 నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్
 
 ( ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
 ఓ వైపు స్వదేశంలో బోర్డుకు గట్టి షాక్... మరోవైపు ఐపీఎల్‌లో తమ భవితవ్యం ఏమిటో తెలియని అయోమయంలో సగం మంది క్రికెటర్లు... అయితే పైకి మాత్రం అందరూ ధీమాగానే ఉన్నారు. భారత్‌లో ఏం జరుగుతోందో తమకు అనవసరమని, జట్టు దృష్టంతా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే ఉందని ధోనిసేన స్పష్టం చేసింది.
 
  మరేదైనా బలమైన జట్టుతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆడటం కాస్త ఇబ్బందేమో గానీ... బంగ్లాతో మ్యాచ్ కాబట్టి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని ఆశించవచ్చు. శుక్రవారం జరిగే సూపర్-10 గ్రూప్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ జట్టు దాదాపుగా సెమీస్‌కు చేరువైనట్లే. ఆ తర్వాతి మ్యాచ్‌లలో ఏవైనా అనూహ్య సమీకరణాలు ఏర్పడితే తప్ప మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
 
 మార్పులు లేకుండానే...
 భారత జట్టు ఈసారి కూడా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. యువరాజ్ ఒక్కడి ఫామ్ మినహా అందరూ బాగానే ఆడుతున్నారు. గురువారం రోజు ప్రాక్టీస్‌కు అందరూ వచ్చారు. ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడి నెట్స్‌కు వెళ్లారు. ధావన్, యువరాజ్ మరోసారి ఎక్కువగా నెట్స్‌లో గడిపారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీషాట్లు ప్రాక్టీస్ చేశారు. బంగ్లా జట్టులో షకీబ్‌ను ఆడాలనే ఉద్దేశంతోనో ఏమో.. ప్రాక్టీస్‌లో భారత ప్రధాన ఆటగాళ్లంతా జడేజాతో బౌలింగ్ చేయించుకుని ఆడారు.
 
 25 వేల మందితో హోరు...
 ప్రస్తుత ఫామ్, జట్టు బలం దృష్ట్యా భారత్‌కు బంగ్లాదేశ్ పోటీ ఇచ్చినా గొప్పే అనుకోవాలి. అయితే శుక్రవారం ఇక్కడ సెలవు కావడంతో.... స్టేడియం సామర్థ్యం 25 వేలు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ బ్లాక్‌లో 10వేల టాకాలకు (రూ.8500) అమ్ముతున్నారంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. భారత బ్యాట్స్‌మన్ అవుట్ కోసం బంగ్లా బౌలర్ ఎవరైనా అప్పీల్ చేస్తే... 25 వేల గొంతులు జతకలుస్తాయి. బౌలింగ్‌లో షకీబ్, మొర్తజా,  అమిన్, బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ ముష్ఫికర్ కీలకం.
 
 జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ. మిశ్రా.
 బంగ్లాదేశ్: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, అనాముల్, మోమినుల్, షకీబ్, షబ్బీర్, మహ్మదుల్లా, జియావుర్, సోహాబ్, మొర్తజా, అమిన్.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా