‘కథ’ కోల్‌కతాకు చేరింది

10 Mar, 2016 19:43 IST|Sakshi
‘కథ’ కోల్‌కతాకు చేరింది

ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, పాక్ మ్యాచ్
భద్రతా కారణాలతో వేదిక మార్పు
తప్పలేదని ప్రకటించిన ఐసీసీ
 

 
న్యూఢిల్లీ: మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరిలో ఉండే ఉత్కంఠ, ఆసక్తి వేరు. కానీ ఆ మ్యాచ్ ఎక్కడ ఆడాలనేదానిపై కూడా అదే స్థాయిలో డ్రామా కొనసాగింది. దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన ఈ వివాదానికి ఎట్టకేలకు బుధవారం తెర పడింది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 19న ఇరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలలో ఆడలేమంటూ పాక్ బోర్డు చేసిన విజ్ఞప్తికి స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మ్యాచ్‌ను కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం 19నే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ‘భద్రతా కారణాలతో ఈ మ్యాచ్ వేదికను మార్చాలని నిర్ణయించాం. దీని వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుందని ఐసీసీ, బీసీసీఐకి తెలుసు.

అయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతపై సందేహం పెంచేలా చేసిన వ్యాఖ్యలతో సమస్య మొదలైంది. మరికొంత మంది మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టిస్తామని కూడా బెదిరించారు. అన్ని వర్గాల రక్షణ బాధ్యత మాపై ఉంది. ఐసీసీ భద్రతా అధికారులతో పాటు పీసీబీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వేదిక మార్చడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది’ అని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. భారత్‌లాంటి పెద్ద దేశంలో పరిస్థితుల గురించి తమకు తెలుసని, ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ సమయంలో అనేక సవాళ్లు ఎదురు కావడం సహజమేనన్న రిచర్డ్సన్... బీసీసీఐపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదన్నారు. ఐసీసీ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్వాగతించారు. మరోవైపు ఇప్పటికే ధర్మశాల మ్యాచ్‌కు టికెట్లు పొందినవారికి ఆసక్తి ఉంటే కోల్‌కతాకు అవే టికెట్లను అనుమతిస్తామని, లేదంటే పూర్తి మొత్తం వెనక్కి ఇస్తామని కూడా రిచర్డ్సన్ చెప్పారు.


 ‘తమాషా’ ముగిసింది!
భారత్, పాక్ మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని, అందులో మార్పు లేదని స్వయంగా టోర్నమెంట్ డెరైక్టర్ ఎంవీ శ్రీధర్ ప్రకటించిన మరుసటి రోజే సీన్ మారిపోయింది. సోమవారం ధర్మశాల స్టేడియాన్ని సందర్శించిన పాక్ ప్రత్యేక బృందం ఇక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు లేవంటూ నివేదిక ఇవ్వడంతో బుధవారం భారత్ బయల్దేరాల్సిన తమ జట్టును పీసీబీ నిలిపివేసింది. మొహాలీ, కోల్‌కతాలలో ఏదో ఒక చోటుకు మార్చాలంటూ విజ్ఞప్తి చేయగా... చివరికి వారి మాటకే ఐసీసీ తలొగ్గాల్సి వచ్చింది.

అన్నింటికంటే ముందుగా తాము మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని, మాజీ సైనికులు అభ్యంతరం చెబుతున్నారంటూ ఈ నెల 1న  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి రాసిన లేఖతో వివాదం రాజుకుంది. ఈ వ్యాఖ్యలను చూపిస్తూ పాక్ బోర్డు తమ భద్రతపై గట్టి హామీ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ధర్మశాలలోనే మ్యాచ్ జరిపేందుకు ఐసీసీ, బీసీసీఐ చివరి వరకు పట్టుదల కనబర్చినా లాభం లేకపోయింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందంటూ స్వయంగా హోంశాఖ ప్రకటించినా... అది సరిపోలేదు.

 పాపం ఠాకూర్...
బీసీసీఐ కార్యదర్శి హోదాలో ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను తన సొంత మైదానంలో నిర్వహించే అవకాశం దక్కించుకున్న అనురాగ్ ఠాకూర్ అత్యుత్సాహం చివరకు ఆయనకు నిరాశనే మిగిల్చింది. డిసెంబర్ 11న ఈ మ్యాచ్ ప్రకటించినప్పుడే కేవలం 20 వేల సామర్థ్యం మాత్రమే ఉన్న ధర్శశాలకు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఠాకూర్ ప్రపంచకప్‌కు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రినుంచి వ్యతిరేకత వచ్చింది.

బీజేపీ ఎంపీ, యువమోర్చా అధ్యక్షుడిగా కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి మ్యాచ్ జరిపేందుకు ఆయన చివరి వరకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే కేవలం ఠాకూర్ కోసం సమస్యను మరింత జటిలం చేసుకోవడం ఇష్టం లేని ఐసీసీ వేదిక మార్చింది. భారత్‌లో పెద్ద మైదానమైన ఈడెన్‌లో ‘పెద్ద’ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫైనల్‌కు కూడా ఇదే వేదిక అయినా... లీగ్ షెడ్యూల్‌లో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ లేకపోవడంతో ఈడెన్‌ను వేదికను చేశారు.

భారత్, పాక్ మ్యాచ్ ధర్మశాలనుంచి తరలిపోవడం పట్ల అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆవేదనకు, అసహనానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అందరి పరువు పోయిందని ఆయన అన్నారు. ‘హిమాచల్ రాష్ట్రం, దేశం పేరు ప్రతిష్టలు చెడగొట్టడంలో ముఖ్యమంత్రి సఫలమయ్యారు. అధికార పార్టీ ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టడం అందరినీ ఇబ్బంది పెట్టింది. ఒక సీఎం ఇలా చేయడం దురదృష్టకరం. వారి దృష్టిలో దేశంకంటే సొంత కుటుంబం, పార్టీకే ప్రాధాన్యత. ప్రపంచకప్ మ్యాచ్ నిర్వహణ కోసం ప్రతీ రాష్ట్రం పోటీ పడుతుంది. మనకు ఈ అవకాశం దక్కితే భద్రత లేదంటూ కాలదన్నుకోవడం ఘోరం’ అని ఠాకూర్ తీవ్ర నిరాశతో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు