హోరాహోరీ ఆరంభం

15 Aug, 2013 01:59 IST|Sakshi
హోరాహోరీ ఆరంభం

న్యూఢిల్లీ: ఆరంభ విఘ్నాలను అధిగమించి కార్యరూపం దాల్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఆరంభం హోరాహోరీగా జరిగింది. చివరిదైన నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఫలితం తేలింది. ఆఖరి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో  అశ్విని పొన్నప్ప-జోచిమ్ ఫిషర్ నీల్సన్ (పుణే పిస్టన్స్) జోడి 21-19, 16-21, 11-3తో గుత్తా జ్వాల-కియెన్ కీట్ కూ (ఢిల్లీ) జంటపై గెలిచి పుణే పిస్టన్స్‌కు 3-2తో విజయాన్ని అందించింది. అంతకుముందు పురుషుల తొలి సింగిల్స్ మ్యాచ్‌లో... ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. పుణే పిస్టన్స్‌కు ఆడుతోన్న ప్రపంచ ఏడో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను వరుస గేముల్లో బోల్తా కొట్టించి ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు.
 
 37 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-16, 21-20తో తియెన్ మిన్ ఎన్గుయెన్‌ను ఓడించాడు. గత ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తియెన్ కాంస్యం నెగ్గడం గమనార్హం. మొత్తానికి సాయిప్రణీత్ తన కెరీర్‌లో మరో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. గత జూన్‌లో ఇండోనేసియా ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ తౌఫిక్ హిదాయత్‌ను... సింగపూర్ సూపర్ సిరీస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను... ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ మహ్మద్ హఫీజ్ హషీమ్ (మలేసియా)ను సాయిప్రణీత్ ఓడించాడు.
 
 సాయిప్రణీత్ విజయంతో స్మాషర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినా... రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జూలియన్ షెంక్ (పుణే-జర్మనీ) 21-15, 21-6తో జిందాపొన్ నిచావోన్ (ఢిల్లీ-థాయ్‌లాండ్)పై నెగ్గి స్కోరును సమం చేసింది. తర్వాత పురుషుల డబుల్స్‌లో బూన్ హోయెంగ్ తాన్-కియెన్ కీట్ కూ (ఢిల్లీ-మలేసియా) జోడి 21-13, 21-16తో రూపేశ్ కుమార్-సనావే థామస్ (పుణే-భారత్) జటను ఓడించి ఢిల్లీకి 2-1 ఆధిక్యాన్ని ఇచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ (పుణే-భారత్) 21-16, 19-21, 11-5తో హెచ్.ఎస్.ప్రణయ్ (ఢిల్లీ-భారత్)పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు.
 

>
మరిన్ని వార్తలు