రెండోరోజూ సీమాంధ్ర బంద్ | Sakshi
Sakshi News home page

రెండోరోజూ సీమాంధ్ర బంద్

Published Thu, Aug 15 2013 1:51 AM

రెండోరోజూ సీమాంధ్ర బంద్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు రెండోరోజూ మూతపడ్డాయి. బుధవారం కూడా పరిపాలన పూర్తిగా స్తంభించింది. ఏపీ ఎన్జీవో, ఉపాధ్యాయ జాక్టో, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బ్యాంకులు, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు విద్యాసంస్థలు మూతపడ్డాయి.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రోడ్డెక్కలేదు. 122 డిపోల్లో బస్సులు బయటకురాలేదు. నెల్లూరు డిపోలో 158 బస్సులు డిపో దాటాయి. కానీ అవి కూడా పూర్తిస్థాయిలో తిరగలేదు. తిరిగిన కొన్ని బస్సులకు కూడా ప్రయాణికుల ఆదరణ లభించలేదు. తిరుమలకు బుధవారం 106 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌తో పాటు సీమాంధ్రలోని అన్ని బస్‌స్టేషన్లు బోసిపోయాయి.

హైదరాబాద్, సీమాంధ్ర జిల్లాల మధ్య ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో సీమాంధ్ర అంతటా సరుకు రవాణాకు అంతరాయం కలిగింది. 13 జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాలు పనిచేయకపోవడంతో.. లారీలకు ఫిట్‌నెట్ సర్టిఫికెట్లు, పర్మిట్లు తీసుకోవడం సాధ్యం కాలేదు. దాదాపు 10 వేల లారీలు రోడ్డక్కెకుండా నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం నామమాత్రంగానే కనిపించింది.
 
అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు బుధవారం యథావిధిగా పనిచేశాయి. పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ నిరసన ప్రదర్శనలు చేశారు. చిత్తూరు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగులు కార్యాలయాల ముందు బైఠాయించి నిరసనలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఏపీ ఎన్జీవోల సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో సుమారు 35వేల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కృష్ణా జిల్లాలో విద్యాసంస్థలను స్వచ్చందంగా మూసివేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగులందరూ రోడ్లపైకి చేరి ఆందోళనలు చేశారు.

విశాఖ జిల్లాలోని అన్ని పట్టణ కేంద్రాల్లో దుకాణాలు మూతపడ్డాయి. విశాఖపట్నం పోర్టుకు వివిధ ప్రాంతాలనుంచి రావలసిన మత్స్య ఉత్పత్తులు, లారీల రాక ఆలస్యమవుతుండటంతో నౌకలు సకాలంలో కార్గోతో ప్రయాణించడం లేదు.  శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పరిషత్ ఉద్యోగులు దీక్షలు, విద్యుత్తుశాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. విజయనగరం జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైతం కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏలూరులో ఎన్జీవోలు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కాకినాడలో వర్తక, వాణిజ్య, వ్యాపార దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు.
 
 సమ్మెలో టీటీడీ ఉద్యోగులు
 సమైక్యాంధ్రకు మద్దతుగా టీటీడీ ఉద్యోగులు రెండోరోజూ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. దీంతో టీటీడీ పరిపాలనా భవనం, అనుబంధ కార్యాలయాలు వెలవెలబోయాయి. బుధవారం వేకువజామున 3 గంటల నుంచి తిరుమల డిపోకు చెందిన 106 బస్సు సర్వీసులు తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి.

Advertisement
Advertisement