ఆధునికత...సంప్రదాయం...

4 Oct, 2015 10:26 IST|Sakshi
ఆధునికత...సంప్రదాయం...

అట్టహాసంగా ఐఎస్‌ఎల్ ప్రారంభం
 
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. సంప్రదాయం... ఆధునికత మేళవింపుతో రూపొందించిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం ఆరు గంటలకు జవహర్‌లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు హిందీ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా... మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, యువ నటి ఆలియా భట్ తమ నృత్యాలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్, బాలీవుడ్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అమితాబ్ బచ్చన్‌లతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని హోదాలో సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. 79 రోజుల పాటు ఇక ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే.

ముందుగా కేరళ సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు.

అనంతరం ఆలియా భట్ హిందీ ఫాస్ట్ బీట్ పాటలకు వేసిన స్టెప్పులతో ప్రేక్షకులు హుషారెత్తారు.

ఆలియా అనంతరం మాజీ మిస్‌వరల్డ్ ఐశ్వర్యా రాయ్ తనదైన శైలిలో అలరించింది.

మెడ్లీలో భాగంగా ముందుగా తమిళ రోబో పాటతో ఆరంభించి ధూమ్.. మచాలే, ధోలా రే ధోలా అంటూ స్టేడియంలో ఒక్కసారిగా జోష్‌ను నింపింది.

ఆ తర్వాత వేదికపైకి కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని సచిన్‌ను ఆహ్వానించడంతో స్టేడియంలో ఒక్కసారిగా సా..చిన్, సా..చిన్ అంటూ నినాదాలు మార్మోగాయి.

నీతా అంబానీ, ఐశ్వర్య, ఆలియా కూడా వేదికపైకి ఎక్కారు.ఓపెన్ టాప్ జీపులో ఫుట్‌బాల్‌ను తీసుకువచ్చిన రజనీకాంత్ వేదికపై ఉన్న నీతాకు అందించారు.

దీంతో టోర్నీ ఆరంభమైనట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా బాణసంచా వెలుగులు విరజిమ్మాయి.

చివరిగా స్టేడియంలోకి చెన్నై, కోల్‌కతా జట్లు వచ్చిన అనంతరం ఏఆర్ రెహమాన్ జాతీయగీతాలాపన చేశాడు.
 
 

మరిన్ని వార్తలు