పోరాడి ఓడిన ప్రజ్నేశ్‌ 

13 Mar, 2019 00:50 IST|Sakshi

మూడో రౌండ్‌లో కార్లోవిచ్‌ చేతిలో పరాజయం

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ పోరాటం ముగిసింది. క్వాలిఫయర్‌ హోదాలో పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన 29 ఏళ్ల ప్రజ్నేశ్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 69వ ర్యాంకర్‌ బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై... రెండో రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ నికోలజ్‌ బాసిలాష్‌విలి (జార్జియా)పై సంచలన విజయాలు సాధించాడు. అయితే మూడో రౌండ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 3–6, 6–7 (4/7)తో ప్రపంచ 89వ ర్యాంకర్, అపార అనుభవజ్ఞుడు ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 40 ఏళ్ల కార్లోవిచ్‌ ఏకంగా 16 ఏస్‌లు సంధించాడు.

6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్‌ బుల్లెట్‌లాంటి సర్వీస్‌లకు ప్రజ్నేశ్‌ వద్ద జవాబు లేకపోయింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే కార్లోవిచ్‌ సర్వీస్‌లో రెండు బ్రేక్‌ పాయింట్లు సంపాదించిన ప్రజ్నేశ్‌ వాటిని సద్వినియోగం చేసుకోలేదు. అనంతరం ఎనిమిదో గేమ్‌లో ప్రజ్నేశ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కార్లోవిచ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్‌ గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కార్లోవిచ్‌ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్‌లో ఓడిన ప్రజ్నేశ్‌కు 48,775 డాలర్ల (రూ. 34 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 61 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో వచ్చే వారం విడుదలయ్యే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్‌ 97 నుంచి 82వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది.    

మరిన్ని వార్తలు