పదేళ్లయినా పట్టేస్తారు

16 Feb, 2014 02:13 IST|Sakshi
పదేళ్లయినా పట్టేస్తారు

డోపీలపై ఐఓసీ చేతిలో సరికొత్త అస్త్రం
 సోచి: డోపీల భరతం పట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నడుంబిగించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో డోపీలను ఇప్పుడు కాకపోయినా పదేళ్ల కాలంలో ఎప్పుడైనా పట్టుకునేందుకు తమ ప్రణాళికలకు పదునుపెట్టింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకొన్నప్పటికీ ప్రస్తుత పరీక్షల్లో డోపీలుగా తేలకపోతే సదరు ఆటగాళ్లు నిశ్చింతగా ఉండటానికి వీళ్లేదు.
 
  ఎందుకంటే ఒకసారి తీసుకున్న రక్త, మూత్ర నమూనా (శాంపిల్స్)లను పదేళ్ల దాకా భద్రపరిచి వీలుచిక్కినప్పుడల్లా క్షుణ్నంగా పరీక్షించనున్నారు. దీంట్లో ఎప్పుడు దోషిగా తేలినా శిక్ష తప్పదన్న మాట. తాజాగా ఇక్కడ జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తీసుకుంటున్న శాంపిల్స్‌ను కూడా పదేళ్ల పాటు భద్రపరిచి దోషుల్ని దొరకబుచ్చుకుంటారు.

 సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ (హెచ్‌జీహెచ్) పరీక్ష ద్వారా డోపీల భరతం పడతారు. దీనిపై ఐఓసీ మెడికల్ కమిషన్ చైర్మన్ ఆర్నే జుంగ్‌క్విస్ట్ మాట్లాడుతూ ‘అథ్లెట్లు ఉత్ప్రేరకాలు తీసుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పట్టుకుంటాం. ఈ సంగతిని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది’ అని చురకంటించారు.
 

మరిన్ని వార్తలు