విభజనపై బీజేపీది ఒకే మాట | Sakshi
Sakshi News home page

విభజనపై బీజేపీది ఒకే మాట

Published Sun, Feb 16 2014 2:08 AM

విభజనపై బీజేపీది ఒకే మాట - Sakshi

వెంకయ్యనాయుడు స్పష్టీకరణ
 
సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉంది. సీమాంధ్ర న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో విభజన జరగాలి’’ అని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. లోక్‌సభ రభసకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనన్నారు. సభ జరగకుండా చేసి, బీజేపీని విభజన వ్యతిరేకిగా చిత్రించడానికే ఈ కుట్రలు పన్నుతున్నార ని శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. సభలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసేలా వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యమైన విభజన బిల్లు పెట్టే సమయంలో ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సభలో లేకపోవడం శోచనీయమన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలను విని పరిష్కార చర్యలపై చర్చించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌కు పోయేకాలం రావడం వల్లే దింపుడు కళ్లం ఆశతో ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్ రెండంకెలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. విభజనకు ముందు కొన్ని డిమాండ్లపై బీజేపీ తరఫున ప్రణాళికా సంఘం అంగీకారం కోరుతున్నామన్నారు. ఆ డిమాండ్లు...
 
  సీమాంధ్రలో నిధులు, రాబడి కొరతను ఎలా ఎదుర్కొంటారో చెప్పాలి
  రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణకు రాయితీలు ప్రకటించాలి
 తెలంగాణలో కరెంట్ కోత భయం లేకుండా కేంద్రం బాధ్యతలు తీసుకోవాలి. 4,000 మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
 సీమాంధ్రకు తొలి ఏడాది ఏర్పడే లోటును కేంద్ర సంచిత నిధి నుంచి భర్తీ చేయాలి. దీన్ని ఆర్థిక సంఘానికి నివేదించాలి
 విశాఖ, తిరుపతిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, బిజినెస్ స్కూల్, హార్టికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి
 హైదరాబాద్ మాదిరి విశాఖకూ ఐటీఐఆర్ మంజూరు చేయాలి
 విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి. ముంబై-ఢిల్లీ తరహాలో విశాఖ-చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేయాలి
 హైదరాబాద్‌లో ఉన్నవారికి ప్రాంతాలతో సంబంధం లేకుండా పూర్తి రక్షణ కల్పించాలి
 కొత్త రాజధాని ఏర్పాటు, నిధుల కేటాయింపుపై సమగ్ర ప్రణాళిక ఇవ్వాలి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement