జోరు కొనసాగిస్తాం

16 Apr, 2017 02:27 IST|Sakshi
జోరు కొనసాగిస్తాం

మార్కోస్‌ అలోన్సో ఇంటర్వ్యూ
గత ఆగస్టులో ఫియోరెన్‌టినా జట్టు నుంచి 23 మిలియన్‌ పౌండ్లకు డిఫెండర్‌ మార్కోస్‌ అలోన్సోను చెల్సీ జట్టు కొనుగోలు చేసింది. ఈ ఎంపిక చెల్సీ జట్టుకు మంచి ఫలితాలే తెచ్చి పెట్టింది. రక్షణపంక్తిలో కీలకంగా వ్యవహరిస్తున్న అలోన్సో ఐదు గోల్స్‌ కూడా చేశాడు. ప్రస్తుతం ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) సీజన్‌లో 75 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చెల్సీ జట్టు టైటిల్‌పై గురి పెట్టింది. ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌తో రెండోసారి చెల్సీ తలపడనుంది. ఈ ఏడాది మాంచెస్టర్‌ యునైటెడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెల్సీ 4–0తో గెలిచి జోరు మీదుంది. ఈ నేపథ్యంలో అలోన్సో ఏమంటున్నాడంటే...

మీ జట్టుకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. జట్టులో ఎలాంటి వాతావరణం ఉంది?
అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సమష్టిగా ఆడుతూ నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాం. అయితే టైటిల్‌ గెలిస్తేనే మా ప్రదర్శనకు విలువ ఉంటుందని జట్టు కోచ్‌ అంటోనియో కొంటె అంటున్నారు. కాబట్టి విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాం.

వ్యక్తిగతంగా ఈ సీజన్‌లో మీరెంతో బాగా రాణించారు. మిమ్మల్ని కొత్త స్థానంలో ఆడించడం ఎలా అనిపిస్తోంది?
అలవాటు లేని స్థానంలో ఆడటం క్లిష్టమే. కానీ ఇటలీ లీగ్‌లో నేను ఈ విధంగా ఆడినందుకు తొందరగానే అలవాటు పడ్డాను. ప్రత్యర్థి జట్లపై అటాక్‌ చేస్తూనే డిఫెండ్‌ కూడా చేసుకోవడం సులభం కాదు. పక్కా ప్రణాళికతో సిద్ధమై ఏకకాలంలో ఈ రెండు స్థానాల్లో ఆడినందుకు మంచి ఫలితాలే వచ్చాయి.

మాంచెస్టర్‌ యునైటెడ్‌తో జరిగే కీలక పోరుకు ముందు మీ వ్యూహంలో ఏమైనా మార్పులు చేస్తారా?
అదేం లేదు. జట్టులో ఎవరి బాధ్యత ఏంటో అందరికీ తెలుసు. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో పరిస్థితికి తగ్గట్టు మార్పులు చేసే అవకాశముంది.

ఈ సీజన్‌లో మీరు ఐదు గోల్స్‌ చేశారు. మాంచెస్టర్‌ యునైటెడ్‌పై మీ నుంచి ఎలాంటి ఆటతీరును ఆశించవచ్చు?
గణాంకాల పరంగా గోల్స్‌ అన్నవి నాకంత ముఖ్యమైనవి కాదు. జట్టు గెలవడం ప్రధానం. మరిన్ని గోల్స్‌ సాధించి సీజన్‌ చివరివరకు మా విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాను. మున్ముందు కూడా ఇదే తరహాలో ఆడితే ప్రత్యర్థి జట్లకు మమ్మల్ని నిలువరించడం కష్టమే.

మరిన్ని వార్తలు