రోగులను డబ్బులడిగితే క్రిమినల్‌ కేసులు | Sakshi
Sakshi News home page

రోగులను డబ్బులడిగితే క్రిమినల్‌ కేసులు

Published Sun, Apr 16 2017 2:31 AM

రోగులను డబ్బులడిగితే క్రిమినల్‌ కేసులు

ఛాతీ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రోగులను డబ్బులు అడిగే ప్రభుత్వ ఆసుప త్రుల వైద్య సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న నిరుపేద రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినా, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అలాంటి వారిపట్ల కఠినం గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. శనివారం మంత్రి ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు.

అవుట్‌ పేషంట్, ఇన్‌ పేషంట్‌ వార్డులను సందర్శించి... ఆసు పత్రిలో అందుతున్న వైద్యసేవలు, రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రిలోని పడకలు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ఇటీవల ఐసీయూ లో ఆక్సిజన్‌ ఇవ్వకపోవడంతో కొంతమంది రోగులు మృతిచెందిన అంశంపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంపై వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లంచం అడిగితే నాకు చెప్పండి...: ఎవరైనా లంచం అడిగితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా లక్ష్మారెడ్డి రోగులకు సూచించారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఛాతీ ఆస్పత్రిలో త్వరలోనే అధునాతన ఐసీయూ సహా, సీటీ స్కాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నగరంలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాలను అభివృ ద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగానే గర్భవతులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించి, అధునాతన పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సాయికుమార్, ఆర్‌ఎంఓ నరేందర్‌ మంత్రి వెంట ఉన్నారు.

Advertisement
Advertisement