ఈసారి ‘అఫ్గాన్‌’ కూడా...

15 Feb, 2017 01:07 IST|Sakshi
ఈసారి ‘అఫ్గాన్‌’ కూడా...

351 మందితో ఐపీఎల్‌ తుది జాబితా ∙20న వేలం

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో సీజన్‌ కోసం జరిగే వేలంలో ఆటగాళ్ల జాబితాను 351 మందికి కుదించారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. ఈనెల 20న జరిగే ఈ వేలంలో ఓవరాల్‌గా 799 మందితో ఈ జాబితాను రూపొందించినా అందులో వడపోత అనంతరం 448 మందిని తప్పించారు. అయితే తొలిసారిగా అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్‌ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కెప్టెన్‌ అస్ఘర్‌ స్టానిక్‌జాయ్, మొహమ్మద్‌ నబీ, షెహజాద్, రషీద్‌ ఖాన్, దవ్లాత్‌ జద్రాన్‌ అందుబాటులో ఉండగా.. వీరిలో షెహజాద్, రషీద్‌లకు అత్యధికంగా కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది. యూఏఈ బ్యాట్స్‌మన్‌ చిరాగ్‌ సూరి ఇతర అసోసియేట్‌ ఆటగాడు. ఇక భారత్‌ తరఫున ఆడి కూడా తుది జాబితాలో చోటు కోల్పోయిన ఏకైక  ఆటగాడు పేసర్‌ సుదీప్‌ త్యాగి. మరోవైపు వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఈసారి కూడా వేలంలో రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌ ఉండవచ్చు.

ఇషాంత్‌కు అత్యధికంగా రూ.2 కోట్ల కనీస ధర
సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సహా ఏడుగురు ఆటగాళ్లకు అత్యధికంగా రూ.2 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌ స్టోక్స్, వన్డే...టి20 కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌లతో పాటు ఆసీస్‌ పేసర్లు జాన్సన్, కమ్మిన్స్, శ్రీలంక కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఈ లిస్టులో ఉన్నారు. ఆ తర్వాత రూ.కోటిన్నర కనీస ధరలో జేసన్‌ హోల్డర్‌ (విండీస్‌), హాడిన్‌ (ఆసీస్‌), బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), లియోన్‌ (ఆసీస్‌), అబాట్‌ (దక్షిణాఫ్రికా), బౌల్ట్‌ (కివీస్‌) ఉండగా రూ.కోటి ధరలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్, హేల్స్, కోరీ అండర్సన్‌ (కివీస్‌), కౌల్టర్‌నైల్‌ (ఆసీస్‌), రబడా (దక్షిణాఫ్రికా), మార్లన్‌ శామ్యూల్స్‌ (విండీస్‌), ఇలియట్‌ (కివీస్‌) ఉన్నారు. ఇటీవల జరిగిన టి20 మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచిన మోహిత్‌ ఆహ్లావత్‌ రూ.10 లక్షలకు అందుబాటులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు