ఆ టాప్‌ ప్లేయర్‌కు కూడా బుకీలతో సంబంధాలు!!

23 Aug, 2018 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం విచారణలో భాగమైన పోలీస్‌ ఆఫీసర్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌- 2013 సీజన్‌లో చోటుచేసుకున్న స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది కూడా. అదే విధంగా చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల పాటు వేటు పడింది. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ విచారణలో భాగమైన సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ బీబీ మిశ్రా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ప్రపంచ కప్‌- 2011 విజేతగా నిలిచిన భారత జట్టులో భాగమైన ఓ సీనియర్‌ ఆటగాడికి పలువురు బుకీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్‌ 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ విచారణలో భాగంగా ఓ బుకీతో మాట్లాడిన సమయంలో తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే ఆ ఆటగాడి పేరు బయటపెట్టేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

నాకంత సమయం లేదు అందుకే...
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో భాగంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విచారించానన్న మిశ్రా... ఇందులో భాగంగా పలువురు బుకీలతో మాట్లాడానన్నారు. ‘2008- 09 నుంచే సదరు సీనియర్‌ ఆటగాడు బుకీలతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. భారత్‌లో జరిగిన వివిధ అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి అతడు బుకీలతో మాట్లాడాడు. ఇందుకు సాక్ష్యంగా ఆ ఆటగాడు తనతో జరిపిన వాయిస్‌ రికార్డును నాకు ఇస్తానని ఆ బుకీ చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అతడు వెనక్కి తగ్గాడు. అయితే కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు, శ్రీనివాసన్‌, గురునాథ్‌ మయప్పన్‌(చెన్నై సూపర్‌ కింగ్స్‌), రాజ్‌కుంద్రా (రాజస్తాన్‌ రాయల్స్‌), సుందర్‌ రామన్‌(ఐపీఎల్‌ మాజీ సీఓఓ)లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే నా ముఖ్య విధి. అందుకే ఆ సీనియర్‌ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేకపోయానంటూ’ మిశ్రా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు