ఇద్దరూ ఇద్దరే...

28 Sep, 2015 23:58 IST|Sakshi
ఇద్దరూ ఇద్దరే...

వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా ‘క్లాసికల్’ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు ‘రాక్‌స్టార్’లా చిందేయిస్తాడు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రస్తుత క్రికెట్‌లో నిలకడకు మారుపేరుగా మారారు. ఈసారి గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం.
 
* పోటాపోటీగా సాగుతున్న కోహ్లి, ఆమ్లాల కెరీర్   
* గాంధీ-మండేలా సిరీస్‌లోనూ ఈ ఇద్దరే కీలకం
సాక్షి క్రీడావిభాగం: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా ముందుగా కోహ్లి, ఆమ్లాల పేర్లు చెప్పాల్సిందే. ఈ ఇద్దరూ తమ జట్లకు ఎన్నో సంచలన విజయాలు అందించారు. 50కి పైగా సగటుతో పరుగులు చేయడం, తరచూ సెంచరీలు సాధించడం, చిరస్మరణీయ విజయాలు అందించడం ద్వారా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే దక్షిణాఫ్రికా జట్టు ఆడుతుందంటే అటు అభిమానుల దృష్టి, ఇటు ప్రత్యర్థుల లక్ష్యం ఆమ్లానే.

అలాగే భారత్ తరఫున కోహ్లిది కూడా అదే పాత్ర. అతను ఒక్కసారి కుదురుకుని ఆడాడంటే పరుగుల ప్రవాహమే. ఈసారి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు బాగా క్రేజ్ పెరిగింది. జాతీయ నేతల పేర్లతో సిరీస్ ఏర్పాటు కావడం, ఇటీవల కాలంలో రెండు జట్లు కూడా బలమైన ప్రత్యర్థులతో ఆడకపోవడం వల్ల ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సహజంగానే ఈ సిరీస్ సందర్భంగా కోహ్లి, ఆమ్లాల గురించి చర్చ మొదలైంది.
 
ఇద్దరి ఆటశైలి భిన్నం...
దక్షిణాఫ్రికా స్టార్ ఆమ్లా ఆటతీరు పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు ఆడి చూపిస్తాడు. అధికంగా ప్రయోగాలు చేయడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధిస్తాడు. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఇక అవుట్ చేయడం చాలా కష్టం. అన్ని ఫార్మాట్లలో కలిపి 13 వేలకు పైగా పరుగులు చేసినా... ఇప్పటివరకూ కెరీర్‌లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 56 మాత్రమే. అటు కోహ్లి ఆట దీనికి భిన్నం. షాట్లలో ప్రయోగాలు చేయడానికి వెనుకాడడు.

అదే విధంగా బలమైన షాట్లతో బౌండరీలు, సిక్సర్లతో పరుగులు సాధిస్తాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా పరుగులు చేస్తే అందులో 91 సిక్సర్లు ఉన్నాయి. ఆమ్లా కెరీర్ అంతటా టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. కోహ్లి మాత్రం ఫార్మాట్‌ను బట్టి టాప్ ఆర్డర్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్‌లోనూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. నిలకడ విషయంలో ఇద్దరూ సమానంగా ఉన్నా... ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విరాట్ కోహ్లి ముందుంటాడు.
 
ఆమ్లానే సీనియర్...
ఇద్దరిలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ముందుగా వచ్చింది మాత్రం ఆమ్లానే. 2004లో భారత్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు ద్వారా ఆమ్లా అరంగేట్రం చేశాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను... వన్డేల్లో 2008లో అరంగేట్రం చేశాడు. దీనికి భిన్నంగా కోహ్లి తొలుత 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసి ... మూడేళ్ల తర్వాత 2011లో టెస్టు జట్టులో స్థానం సంపాదించగలిగాడు. ఇద్దరూ వన్డేల్లో ఒకే  ఏడాది అరంగేట్రం చేసినా కోహ్లి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు.

ఈ ఏడేళ్ల కాలంలో భారత్ ఎక్కువగా వన్డేలు ఆడటం వల్ల సహజంగానే కోహ్లి ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఇద్దరి కెరీర్ అప్పటి నుంచి కూడా పోటాపోటీగానే సాగుతోంది. కోహ్లి 22 సెంచరీలు చేస్తే... ఆమ్లా 21 శతకాలు కొట్టాడు. కోహ్లి అనేక రికార్డులు సాధించాడు. అయితే వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి ఘనతలన్నింటినీ ఆమ్లా అధిగమిస్తూ వస్తున్నాడు.
 
అన్ని ఫార్మాట్లలోనూ...
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక మంది క్రికెటర్లు ఏదో ఒక ఫార్మాట్‌కు లేదా రెండు ఫార్మాట్‌లకు పరిమితమవుతున్నారు. ప్రతి జట్టులోనూ అన్ని రకాల ఫార్మాట్లలో ఆడే నైపుణ్యం ఉన్న క్రికెటర్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ ఇద్దరూ మాత్రం మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అలాగే తమ తమ టెస్టు జట్లకు ఈ ఇద్దరూ ప్రస్తుతం కెప్టెన్లు. ఆమ్లా వయసు 33 ఏళ్లు.

కోహ్లి తనకంటే ఆరేళ్లు చిన్నోడు. కాబట్టి ఆమ్లాతో పోలిస్తే విరాట్ ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగుతాడు. కాబట్టి భవిష్యత్తులో ఆమ్లా కంటే కోహ్లి ఎక్కువ రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అయితే ఆమ్లా రిటైరయ్యే వరకు మాత్రం కోహ్లికి గట్టి పోటీయే ఉంటుంది.
 
ఎందుకు కీలకమంటే...
ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు తమ జట్లకు ప్రధాన బలం. దక్షిణాఫ్రికా జట్టు ఒకప్పుడు స్పిన్ ఆడటానికి చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు ఆ జట్టును కకావికలు చేసేవారు. ఆమ్లా రంగప్రవేశం తర్వాత ఈ పరిస్థితి మారింది. మిగిలిన క్రికెటర్లు కూడా స్పిన్ ఆడటంలో మెరుగుపడ్డా... ఆమ్లా మాత్రం స్పిన్నర్లకు గోడలా నిలబడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించే ఆమ్లా... ప్రస్తుత సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు కీలకం. ఇక కోహ్లి విషయానికొస్తే స్వదేశంలో అతను తిరుగులేని క్రికెటర్.

వన్డేల్లో అతను చేసిన 22 సెంచరీల్లో 14 భారత్, బంగ్లాదేశ్‌లలో చేసినవే. మందకొడి పిచ్‌ల మీద విరాట్ జోరుకు ఈ గణాంకాలు నిదర్శనం. దక్షిణాఫ్రికా జట్టులో ఇమ్రాన్ తాహిర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ ఉన్నా... స్టెయిన్ నేతృత్వంలోని పేసర్లు కూడా చాలా కీలకం. కొత్త బంతితో బౌన్స్‌ను, పాత బంతితో రివర్స్ స్వింగ్‌నూ రాబడతారు.

ఈ రెండింటిని ఎదుర్కొనే సత్తా కోహ్లిలో ఉంది. ఇటీవల కాలంలో ఒకట్రెండు ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఏడాది కాలంగా కోహ్లి ఆటతీరు అతని స్థాయికి తగ్గట్లుగా లేదు. మళ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా తన ముద్రను చూపించాలని విరాట్ పట్టుదలతో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు