తప్పు చేశాడా..!

1 Jul, 2016 00:50 IST|Sakshi
తప్పు చేశాడా..!

‘పెదవి దాటిన మాట పృథ్వి దాటుతుంది’... మాటలతో కోటలు కట్టే రవిశాస్త్రికి ఈ విషయం తెలియనిది కాదు. ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత గత రెండు దశాబ్దాలుగా తనదైన శైలిలో కామెంటేటర్‌గా కూడా ఈ మాజీ కెప్టెన్ తన అభిప్రాయాలను వెల్లడించడంలో విజయవంతమయ్యాడు. వ్యాఖ్యకు ఉన్న విలువ తెలిసినవాడు కాబట్టే ఎక్కడా మాట తూలకుండా ఇంత కాలం నెగ్గుకొచ్చాడు. కానీ కోచ్ పదవి కోల్పోయిన అసహనం మాటల రూపంలో బయటకు రావడం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. పేరుకు గంగూలీపై ఆగ్రహం కనిపిస్తున్నా... పరోక్షంగా బీసీసీఐ నిర్ణయాన్ని అతను ప్రశ్నించినట్లే.
 
* రవిశాస్త్రిపై బీసీసీఐ అసంతృప్తి
* కామెంటరీకీ దూరమయ్యే ప్రమాదం!

సాక్షి క్రీడా విభాగం: మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌తో పాటు కొన్నాళ్ల క్రితం వరకు కూడా రవిశాస్త్రి బీసీసీఐ ‘పెయిడ్ కామెంటేటర్’గానే ఉన్నాడు. బోర్డులో ఎన్ని లోపాలున్నా, ఆటలో తప్పులు కనిపిస్తున్నా ఆహా, ఓహో అంటూ టీవీ ప్రసారాల్లో భజన చేయడమే వీరి పని. అందు కోసం భారీ మొత్తాన్ని వీరు అందుకున్నారు. గత 20 ఏళ్లలో బీసీసీఐలో శాస్త్రి వేర్వేరు కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నాడు.

అయితే ఇప్పుడు గంగూలీపై చేసిన వ్యాఖ్యలు బోర్డు సీనియర్ అధికారులకు కూడా ఆగ్రహం తెప్పించాయి. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత ఈ రకమైన వివాదం రేగడం వారికి నచ్చలేదు. గట్టిగా చెప్పకపోయినా సంయమనం పాటించమంటూ రాజీవ్ శుక్లా సూచన చేయడం వారి అసంతృప్తిని సూచిస్తోంది. బీసీసీఐలో గంగూలీ ఇప్పుడు చాలా బలమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడని కూడా అర్థమైంది. ఏదో ఒక దశలో ఈ వివాదం శాస్త్రిని వెంటాడవచ్చు.
 
ఎందుకీ తొందరపాటు!
టీమ్ డెరైక్టర్‌గా తాను మంచి ఫలితాలు రాబట్టానని, కాబట్టి తనకు కొనసాగే అవకాశం ఉందని రవిశాస్త్రి గట్టిగా నమ్మాడు. అయితే అనూహ్యంగా కుంబ్లే సీన్‌లోకి రావడం, కోచ్ పదవి చేజారడం ఆయనను అసహనానికి గురి చేశాయనేది వాస్తవం. అయితే ఎంపిక కాకపోవడంతో కాస్త నిరాశ చెందానని, కుంబ్లేకు శుభాకాంక్షలు కూడా చెప్పానని మొదటి రోజు మామూలుగా స్పందించిన శాస్త్రి, తర్వాతి రోజునుంచి తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు.

గంగూలీ సమావేశంలో లేడంటూ బయటపెట్టిన ఆయన అక్కడితో ఆగిపోయినా సరిపోయేది. దీనికి గంగూలీ తనదైన వివరణ ఏదో ఇచ్చుకునేవాడు. కానీ ఆ తర్వాత సౌరవ్‌కు బాధ్యతలు గుర్తు చేయబోయి అనవసరంగా తనకు తాను చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కమిటీ కుంబ్లేకు అనుకూలంగా పని చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కూడా ఎక్కడా నిబంధన విధించలేదు. ఇవన్నీ వాస్తవాలే అయినా ఒకసారి ఎంపిక పూర్తయిన తర్వాత శాస్త్రి ఆగిపోవాల్సింది. బోర్డు రాజకీయాల గురించి తెలిసి, అపార అనుభవం ఉండీ నిర్మొహమాటంగా మాట్లాడటం అతనే తప్పు చేసినట్లుగా బయట ప్రచారమైంది.
 
నమ్మకం పోయింది...
నిజానికి 2014లో  శాస్త్రి జట్టు బాధ్యతలు తీసుకోవడం కూడా ఆశ్చర్యకర నిర్ణయం. జట్టుకు కోచ్ ఫ్లెచర్ ఉండగా డెరైక్టర్ పేరుతో మరో పాత్రను ప్రవేశపెట్టడం, అంతా నాకే రిపోర్ట్ చేయాలి అంటూ శాస్త్రి చెలరేగిపోవడం వరుసగా జరిగాయి. అయితే ఆ సమయంలో బీసీసీఐ అతడిని గట్టిగా (గుడ్డిగా) నమ్మింది. అద్భుతాలు జరగకపోయినా జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం, ఆటగాళ్లు కూడా బాగు బాగు అనడంతో శాస్త్రి 18 నెలల సమయం ఇట్టే ‘సక్సెస్‌ఫుల్’గా గడిచిపోయింది.

ఇప్పుడు కూడా అతను అసమర్థుడు అని ఎవరూ చెప్పలేదు. అధ్యక్షుడు ఠాకూర్ కూడా ప్రశంసించారు. కుంబ్లేకు ఒక అవకాశం ఇద్దామని బోర్డు భావించి ఉండవచ్చు. ఏడాది తర్వాత కుంబ్లే మంచి ఫలితాలు రాబట్టకపోయినా, మరో కారణంతో పదవి వదిలేసినా మళ్లీ వచ్చేందుకు శాస్త్రికి ఏదో ఒక రూపంలో అవకాశం ఉండేది. అతను ఆశిస్తే బోర్డులో లెక్క లేనన్ని పదవులు సిద్ధం.

కానీ ఇప్పుడు బోర్డు ఎంపికను ప్రశ్నించడంతో ఆ దారులు మూసుకుపోయినట్లే. అన్నింటికీ మించి తన బలమైన కామెంటరీకి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రసారకర్తలు ఎవరైనా కామెంటేటర్లను బీసీసీఐనే ఎంపిక చేయడం ఆనవాయితీ.  జట్టుకు అనుకూలంగా మాట్లాడలేదనే సాకుతో  హర్షాభోగ్లేను ఒక్క వేటుతో తప్పించిన బోర్డుకు శాస్త్రిని తప్పించడం కూడా సమస్య కాదు. తన పాత పరిచయాలతో ఏమైనా రాజీ ప్రతిపాదన చేస్తే తప్ప రవిశాస్త్రికి తాజా పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా పరిణమించడం ఖాయం!

మరిన్ని వార్తలు