జైట్లీని కలిసిన ఠాకూర్

27 Sep, 2015 01:39 IST|Sakshi

న్యూఢిల్లీ: బీసీసీఐలో తిరిగి పట్టు కోసం చేస్తున్న ఎన్.శ్రీనివాసన్ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వేగంగా పావులు కదుపుతున్నారు. శరద్ పవార్‌తో శ్రీని జతకట్టడం ఇష్టం లేని ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహాయాన్ని కోరారు. ఇందులో భాగంగా తన వెంట పవార్ వర్గీయులైన శశాంక్ మనోహర్, అజయ్ షిర్కేలను మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. వీరంతా ప్రస్తుత పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వీరి సమావేశాన్ని బోర్డుకు చెందిన అధికారి ఒకరు ధృవీకరించారు. పవార్‌ను బాస్ చేయడంలో ఠాకూర్ వర్గానికి ఎలాంటి వ్యతిరేకత లేదని... ఆయనకు ఆసక్తి లేకపోతే, రాజీవ్‌శుక్లా లేదా షిర్కేలలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలనేది ఈ వర్గం ఆలోచన. వీరికి ఈస్ట్ జోన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరం.
 
అవిషేక్‌ను కలిసిన జైట్లీ: దాల్మియా మృతి అనంతరం అరుణ్ జైట్లీ శనివారం ఆయన కుమారుడు అవిషేక్‌ను కలుసుకున్నారు. గంటన్నరపాటు వారి నివాసంలోనే గడిపిన జైట్లీ.. అవిషేక్‌తో వ్యక్తిగతంగా సంభాషించారు. క్యాబ్ చేతిలో జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్‌సీసీ), త్రిపుర సీఏ ఓట్లు కూడా ఉండడంతో వీరి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు