ట్వంటీ 20 చరిత్రలో తొలిసారి..

24 Jun, 2017 13:05 IST|Sakshi
ట్వంటీ 20 చరిత్రలో తొలిసారి..

టాన్టాన్:ఒక క్రికెటర్ బంతిని అడ్డుకుని అవుట్ గా పెవిలియన్ చేరడం చాలా అరుదు. అయితే దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో ట్వంటీ 20లో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇదే తరహాలో అవుటయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సఫారీ బౌలర్ క్రిస్ మోరిస్ వేసిన 15 ఓవర్ తొలి బంతిని స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న లివింగ్ స్టోన్ బ్యాక్వర్డ్ పాయింట్లోకి ఆడి సింగిల్ తీసే యత్నం చేశాడు. ఇదే క్రమంలో అవతలి ఎండ్ లో ఉన్న జాసన్ రాయ్ కు సింగిల్ కు రమ్మంటూ అరిచాడు.

 

కాగా, మళ్లీ వద్దంటూ సైగ చేయడంతో క్రీజ్ ను సగానికి పైగా దాటి వచ్చిన జాసన్ రాయ్ వెనక్కి వేగంగా కదలబోయాడు. అదే సమయంలో తన గమనాన్ని మార్చుకుంటూ దక్షిణాఫ్రికా ఫీల్డర్ వికెట్లపైకి విసిరిన బంతికి అడ్డుపడ్డాడు. జాసన్ రాయ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డాడని దక్షిణాఫ్రికా అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు నివేదించారు. దీన్ని పరిశీలించిన థర్డ్ అంపైర్ రాబిన్స్సన్..జాసన్ రాయ్ ను అవుట్ గా ప్రకటించాడు. దాంతో 67 పరుగుల వద్ద రాయ్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే అంతర్జాతీయ ట్వంటీ 20 క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇలా అవుట్ కావడం ఇదే తొలిసారి. తన కెరీర్ లో ఎన్నో ఘనతల్ని సాధించిన జాసన్ రాయ్.. ఇలా అవుటై చరిత్రలో నిలవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 174 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఆరు వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.