'జెమ్‌'లాంటి అమ్మాయి

30 Nov, 2017 00:20 IST|Sakshi

మహిళల క్రికెట్‌లో కొత్త సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌ 

దేశవాళీలో పరుగుల వరద

178, 17, 202 నాటౌట్, 27, 107, 75, 100, 128, 153... బీసీసీఐ మహిళల అండర్‌–19 జాతీయ వన్డే టోర్నీలో ముంబై క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సాధించిన స్కోర్లు ఇవి. 17 ఏళ్ల జెమీమా తన ఆటతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలకు కేంద్రంగా మారింది. కొన్నాళ్ల క్రితమే భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌లో చూపించిన ప్రదర్శనతో అందరి దృష్టిలో పడగా, జెమీమాలాంటి హార్డ్‌ హిట్టింగ్‌ క్రికెటర్‌ తనదైన శైలిలో విజృంభిస్తూ మహిళా క్రికెట్‌కు కొత్త దిశ చూపిస్తోంది. నాలుగేళ్ల క్రితమే చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకొని దూసుకొచ్చిన జెమీమా, భవి ష్యత్తులో భారత జట్టు స్టార్‌గా ఎదిగేందుకు కావా ల్సిన అన్ని లక్షణాలు ప్రదర్శిస్తోంది. తాజాగా భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికై సీనియర్‌ టీమ్‌లోకి వచ్చేందుకు ఎంతో దూరంలో లేనని చాటింది.   

సాక్షి క్రీడావిభాగం : దేశవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శన కనబర్చడం జెమీమా రోడ్రిగ్స్‌కు కొత్త కాదు. 2000లో పుట్టిన ఈ అమ్మాయి 13 ఏళ్ల వయసులోనే ముంబై అండర్‌–19 టీమ్‌లో చోటు దక్కించుకుంది.  2014–15 సీజన్‌ అండర్‌–19 టోర్నీలో మూడు అర్ధ సెంచరీలు సహా 268 పరుగులు చేయడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మహిళల చాలెంజర్‌ ట్రోఫీలో కూడా తన స్ట్రోక్‌ప్లేతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. 2015లోనే ఎన్‌సీఏ నిర్వహించిన వన్డే టోర్నీలో ఆమె అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది అయితే ఆమెలోని మెరుపు బ్యాటింగ్‌ ముంబై క్రికెట్‌ను ఊపేసింది.

 జాతీయ అండర్‌–19 టోర్నీలో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు సహా 665 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో పాటు కెప్టెన్‌గా ముంబైని విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. సూపర్‌ లీగ్‌ దశలో అయితే ఆరు మ్యాచ్‌లలో కలిపి ఆమె సగటు 376 కావడం విశేషం! అండర్‌–23 స్థాయిలో వెస్ట్‌జోన్‌ టైటిల్‌ గెలుచుకోవడంలో కూడా జెమీమాదే ప్రధాన పాత్ర. ఇక ఈ ఏడాది అయితే జెమీమాకు ఎదురు లేకుండా పోయింది. 10 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె ఏకంగా ఆరు సెంచరీలు (ఇందులో ఒక డబుల్‌ సెంచరీ), ఒక అర్ధసెంచరీ సహాయంతో 987 పరుగులు సాధించి సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత వన్డేలో డబుల్‌ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన ఈ మ్యాచ్‌లో 163 బంతుల్లోనే రోడ్రిగ్స్‌ 202 పరుగులు చేయడం విశేషం.   

తండ్రి అండదండలతో... 
ముంబైలోని బాంద్రాకు చెందిన జెమీమా పాఠశాల స్థాయిలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌ ఆడింది. అండర్‌–17 జాతీయ స్థాయి హాకీ టోర్నీలలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం కూడా వహించింది. అయితే తండ్రి ఇవాన్‌ రోడ్రిగ్స్‌ ఆమె పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టేలా చేశారు. ఒకప్పుడు కంగా లీగ్‌లలో ఆడిన ఇవాన్‌ ఇప్పుడు కోచ్‌గా పని చేస్తున్నారు. అనేక మంది ఇతర ఆటగాళ్లతో పాటు తన కూతురికి కూడా ఆయనే శిక్షణ ఇస్తున్నారు. కళాత్మక డ్రైవ్‌లతో పరుగులు రాబట్టడంతో పాటు పరిస్థితిని బట్టి గేరు మార్చి దూకుడుగా దూసుకెళ్లడం కూడా జెమీమా ఆటకు ఉన్న ప్రత్యేకత. తన ఇన్నింగ్స్‌ను పరుగుల పరంగా కాకుండా సాధించిన బౌండరీల పరంగా లెక్క పెట్టుకోవడం ఆమెకు అలవాటు. ‘జెమీమా సాధించిన స్కోర్లతో సంతోషంగా ఉన్నాను. 

అయితే ఆమె ఇప్పుడిప్పుడే ఆటలో ఎదుగుతోంది. ధనాధన్‌గా ఆడి కొన్ని పరుగులు చేసిపోయే ప్లేయర్‌గా కాకుండా అసలైన బ్యాట్స్‌మన్‌గా ఆమె రాణించాలనేది మా కోరిక. అందుకు తగిన విధంగానే శిక్షణనిస్తున్నాం’ అని ఇవాన్‌ చెప్పారు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టి20ల కోసం ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో జెమీమాకు స్థానం లభించింది. ‘జూనియర్‌ స్థాయితో పోలిస్తే సీనియర్‌ విభాగంలో ఆట మాత్రమే కాకుండా ఫిట్‌నెస్‌ కూడా చాలా కీలకం. అందుకే దానిపై దృష్టి పెట్టాను. ఒక సారి టీమ్‌లోకి వచ్చాక నా వయసు 17 అయినా 25 అయినా ఆటను మాత్రమే చూస్తారు. ‘ఎ’ టీమ్‌ తరఫున కూడా బాగా ఆడతాను’ అని విశ్వాసం వ్యక్తం చేసిన జెమీమాను తొందరలోనే సీనియర్‌ టీమ్‌లోనూ చూడవచ్చేమో.  

మరిన్ని వార్తలు