వరుసగా ఏడు ఫోర్లు..ఇది అసలు బౌలింగేనా?

8 Nov, 2019 16:36 IST|Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియా ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు గైర్హాజరీ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న ఖలీల్‌ అహ్మద్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. తన కోటా ఓవర్లలో కొన్ని బంతులు తప్పితే పెద్దగా ఆకట్టుకున్న సందర్భం ఇప్పటివరకూ కనబడలేదు. ప్రధానంగా టీ20ల్లో వికెట్లను సాధించడంతో పాటు కట్టడితో బౌలింగ్‌ చేస్తేనే జట్టులో స్థానం సుస్థిరం అవుతుంది. మరి అటువంటిది ఖలీల్‌ వికెట్లను తీయడం మాట అటుంచితే, పరుగుల్ని కూడా భారీగా ఇస్తున్నాడు. అతని బౌలింగ్‌లో ఈజీగా ఫోర్లను కొడుతున్నారు ప్రత్యర్థి బంగ్లా ఆటగాళ్లు.

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ రెండు టీ20ల్లో రెండు వికెట్లు మాత్రమే తీసి 81 పరుగులిచ్చాడు. తొలి టీ20లో 37 పరుగులిచ్చిన అహ్మద్‌.. రెండో టీ20లో 44 పరుగులిచ్చాడు. కాగా, ఈ రెండు టీ20ల్లో వరుసగా ఏడు ఫోర్లు ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఢిల్లీ టీ20లో నాలుగు బౌండరీలు ఇచ్చిన అహ్మద్‌.. రాజ్‌కోట్‌ టీ20లో బౌలింగ్‌ అందుకున్న ఓవర్‌లోనే వరుసగా మూడు ఫోర్లు ఇచ్చాడు. ఇలా ఫోర్లు ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(ఇక్కడ చదవండి: రెండో టి20లో భారత్‌ జయభేరి)

‘తొలి టీ20లో పేలవ ప్రదర్శన చేసిన ఖలీల్‌ను రెండో టీ20లో కూడా కొనసాగించే ధైర్యం రోహిత్‌ శర్మ తప్పితే ఏ ఒక్కరూ చేయరేమో’ అని ఒకరు విమర్శించగా, ‘ ఖలీల్‌ నువ్వు ఒక్కసారి బౌలింగ్‌ చేసేముందు బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడో గుర్తు తెచ్చుకో’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘ ఖలీల్‌ అహ్మద్‌ డాట్‌ బాల్‌ వేస్తే చూడాలని ఉంది. అదే వికెట్‌ తీసినంతగా సంబర పడతాం. దీన్ని పేస్‌ బౌలింగ్‌ అందామా’ అని మరొకరు సెటైర్‌ వేశారు. 

మరిన్ని వార్తలు