మీకిదే సువర్ణావకాశం.. త్వర పడండి: కోహ్లి

16 Sep, 2019 12:18 IST|Sakshi

ధర్మశాల: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ల ముందు సువర్ణావకాశం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కోరాడు. తమను తాము నిరూపించుకోవడానికి ఆలస్యం చేయొద్దని తన సందేశంలో పేర్కొన్నాడు. ‘ యువ క్రికెటర్లు ఎవరైనా నాలుగు-ఐదు అవకాశాల్లోనే వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్‌టీ20 సమయం ఎంతో దూరంలో లేదు. వరల్డ్‌కప్‌ నాటికి భారత్‌ మహా అయితే 30 మ్యాచ్‌లు ఆడొచ్చు. ఈ నేపథ్యంలో నాకు 15 అవకాశాలు రావాలి అనే ఏ ఒక్క యువ క్రికెటర్‌ చూస్తూ కూర్చొవద్దు.

సాధ్యమైనంత త్వరగా ఎంపికైన  యువ ఆటగాళ్లు సత్తాచాటడానికి యత్నించాలి. జట్టు కోణంలో చూస్తే ఎక్కువ అవకాశాలు మీముందు ఉండవు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడి మిమ్ముల్ని మీరు నిరూపించుకోండి. నాలుగు-ఐదు మ్యాచ్‌ల్లోనే మీ సత్తా బయటకు రావాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఒకవైపు వరల్డ్‌ టీ20 వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనుండగా, టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా మొదలు కావడంతో భారత జట్టు యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉంది. భారత జట్టులో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అందర్నీ పరీక్షించాలని భావిస్తోంది.

గత రెండు టీ20 సిరీస్‌లకు భారత జట్టు పలువురు ప్రధాన ఆటగాళ్లను తప్పించింది. ప్రస్తుత దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు సైతం కొంతమందికి విశ్రాంతి నిచ్చింది. ప్రధాన ఆటగాళ్లైన ఎంఎస్‌ ధోని, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌లను తప్పించింది. రాహుల్‌ చహల్‌, దీపక్‌ చహర్‌, నవదీప్‌ షైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు అవకాశం కల్పించింది. భారత-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా కనీసం టాస్‌ వేయకుండానే మ్యాచ్‌ రద్దయ్యింది. రెండో టీ20 మొహాలిలో బుధవారం జరగనుంది.

మరిన్ని వార్తలు