హామిల్టన్ హవా

14 Jun, 2016 00:09 IST|Sakshi
హామిల్టన్ హవా

* కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం                    
* సీజన్‌లో రెండో విజయం

మాంట్రియల్ (కెనడా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్‌లోని తొలి ఐదు రేసుల్లో విఫలమైన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తాజాగా వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. రెండు వారాల క్రితం మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఈ బ్రిటన్ డ్రైవర్... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు.

70 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి గమ్యానికి చేరుకున్నాడు. మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... బొటాస్ (విలియమ్స్)కు మూడో స్థానం లభించింది.

భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ (8వ స్థానం), పెరెజ్ (పదో స్థానం) టాప్-10లో నిలువడం విశేషం. సీజన్‌లో ఏడు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ (మెర్సిడెస్-116 పాయింట్లు), హామిల్టన్ (మెర్సిడెస్-107 పాయింట్లు), వెటెల్ (ఫెరారీ-78 పాయింట్లు) టాప్-3లో ఉన్నారు. సీజన్‌లో తదుపరి రేసు యూరోప్ గ్రాండ్‌ప్రి అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈనెల 19న జరుగుతుంది.
 
అలీకి అంకితం
కెనడా గ్రాండ్‌ప్రి విజయాన్ని దివంగత మేటి బాక్సర్ మొహమ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు. ‘సాధారణంగా నా విజయాన్ని నేనెవరికీ అంకితం ఇవ్వను. కానీ బాక్సర్ అలీ నన్నెంతగానో ప్రభావితం చేశారు. ఆయన జీవితం నాకు ప్రేరణగా నిలిచింది. ఈ రేసులో నేను డ్రైవ్ చేస్తున్న సమయంలోనూ ఆయన గురించి ఆలోచించాను’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు