ధోని సిద్ధం!

19 Sep, 2015 18:21 IST|Sakshi
ధోని సిద్ధం!

బెంగళూరు: త్వరలో భారత్ లో దక్షిణాఫ్రికాతో జరుగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య అక్టోబర్ 2 వ తేదీ నుంచి ట్వంటీ 20 సిరీస్ తో పాటు, వన్డే సిరీస్ జరుగనుంది.  దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ధోని ఎంపికపై తొలుత కాస్త సందిగ్థంలో పడ్డ సెలెక్టర్లు..ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్ వరకూ ధోనికి విశ్రాంతి నివ్వాలని ముందుగా భావించినా.. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ధోనిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారు.

 

భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ఇంకా ఐదు నెలలో సమయం ఉన్న తరుణంలో.. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ ను సన్నాహక సిరీస్ గా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ధోనికి బాధ్యతలు అప్పజెప్పడానికి సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఆదివారం బీసీసీఐ సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ  సమావేశంలో ట్వంటీ 20 సిరీస్ తో పాటు, మూడు వన్డేలకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

ప్రస్తుతం ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లు ఫిట్ గా ఉండటంతో వారి ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాట మరికొంత మంది సీనియర్ ఆటగాళ్ల కూడా జట్టుకు అందుబాటులోకి రావొచ్చు. శిఖర్ ధవన్, మురళీ విజయ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు తదితర ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.  కాగా, గత కొన్ని రోజుల క్రితం గాయంతో జట్టుకు దూరంగా ఉన్న శిఖర్ ధవన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో పాటు చక్కటి ట్వంటీ 20 రికార్డు కలిగి ఉన్న కేదర్ జాదవ్, మనీష్ పాండేలు ట్వంటీ 20లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్ల విభాగంలో అశ్విన్ కు తోడుగా హర్భజన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జింబాబ్వే సిరీస్ కు పక్కకు పెట్టిన రవీంద్ర జడేజా ఎంపిక అంశంపై కూడా సెలెక్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు